Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగిన విధంగా ఉత్పత్తికి ప్రణాళికలు
- కోల్ సదస్సులో డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో బొగ్గుకు డిమాండ్ ఏర్పడిందని సింగరేణి డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. యూరప్‌తో పాటు ఆసియా దేశాల్లో తీవ్ర చమురు కొరత ఏర్పడటంతో ప్రత్యామ్నాయ ఇంధనంగా బొగ్గుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రపంచ అవసరాల రీత్యా బొగ్గు ఉత్పత్తి సంస్థలు తమ లక్ష్యాలను పెంచుకోవాలని సూచించారు. గురువారం ఢిల్లీలో గ్లోబల్ కోల్ సెక్టార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఇండియా కోల్ నాలుగో వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు. మారుతున్న బొగ్గు అవసరాలు, ఉత్పత్తి సంస్థల కర్తవ్యం అనే అంశంపై మాట్లాడారు. డిమాండ్ వల్ల బొగ్గు ధర కూడా పెరుగుతుందనీ, కాబట్టి దేశం లోని పరిశ్రమలు విదేశీ బొగ్గును అధిక ధరకు కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొంటాయనీ, దీంతో స్వదేశీ బొగ్గుకు డిమాండ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అధికోత్పత్తి సాధిస్తున్న క్రమంలో పూర్తి పర్యావరణహితంగా బొగ్గు ఉత్పత్తి, రవాణాను చేపట్టాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. 2014 లో కేవలం 50 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిన సింగరేణి సంస్థ రాష్ట్ర, దేశ అవసరాల రీత్యా ప్రతీ ఏడాది తన ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకుంటూ 2021-22 నాటికి 65 మిలియన్ టన్నుల స్థాయికి చేరిందనీ, ఈ ఏడాది 70 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరనున్నామని తెలిపారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, రైల్వే శాఖ సహాయ మంత్రి రావ్ సాహెబ్ పాటిల్ ధాన్వే, కేంద్ర బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి ఎం.నాగరాజు తోపాటు దామోదర్ వ్యాలీ కోల్ ఫీల్డ్స్ చైర్మెన్ రఘురాం తదితరులు మాట్లాడారు.