Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా పిల్లలకు అందని పౌష్టికాహారం
- అందరికీ విద్యా, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి కల్పించాలి
- బీజేపీ ఉన్నది కార్పొరేట్ల కోసమే
- ఎన్ఎంపీ పేరుతో ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ
- మోడీ విధానాలపై స్కీం వర్కర్లు, కార్మికులు, రైతులు ఐక్యంగా ఉద్యమించాలి : సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఎఆర్ సింధు పిలుపు
- హైదరాబాద్లో ఘనంగా మిడ్డేమీల్ వర్కర్స్ ఫెడరేషన్ అఖిల భారత మహాసభలు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా ఆకలి, పౌష్టికాహార లోపంతో పిల్లలు బాధపడుతున్నారని సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఎఆర్ సింధు ఆవేదన వ్యక్తం చేశారు. ఆజాదీకా అమృత మహోత్సవాలను నిర్వహించడమంటే ఆకలి భారతాన్ని సృష్టించడమేనా?అని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో 50 శాతం వరకు పిల్లలు, పేదలు ఆకలితో అలమటిస్తున్నారనీ, దుర్భర పరిస్థితుల్లో బతుకున్నారని విమర్శించారు. అందరికీ విద్యావైద్యం, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రెండురోజులపాటు కొనసాగనున్న అఖిల భారత మిడ్డేమీల్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ రెండో మహాసభలు శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సీఐటీయూ పతాకాన్ని ఆ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షురాలు ఎస్ వరలక్ష్మి ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపం వద్ద నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి జె భగవాన్ అధ్యక్షతన ప్రారంభసభను నిర్వహించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని విమర్శించారు. కార్పొరేట్ల కోసమే మోడీ పనిచేస్తున్నారనీ, అంబానీ, అదానీ ప్రయోజనాలే సర్కారు లక్ష్యమని అన్నారు. దేశ సంపద, సహజ వనరులు లూటీ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ) పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్నారని విమర్శించారు. ఎల్ఐసీ, బ్యాంకులు, రైల్వే, ఇన్సూరెన్స్, విద్యుత్, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని అన్నారు. నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం దేశానికే ప్రమాదకరమన్నారు. బీజేపీ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా పనిచేయడం లేదనీ, డబ్బు నీళ్లలా పారుతున్నదని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు రాజకీయ పార్టీలకు నిధులిస్తున్నాయని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేస్తున్నదని వివరించారు. రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా ఏ పార్టీ నుంచి గెలిచినా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. కులం, మతం ఆధారంగా ప్రజల మధ్య విద్వేషాలు పెంచడం వల్ల సమస్యలు ముందుకు రావడం లేదన్నారు. నాలుగు లేబర్ కోడ్లతో కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఎనిమిది గంటల పనివిధానం, సమ్మె చేసే హక్కు కార్మికులకు లేకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకోవైపు పథకాల పేర్లను కేంద్రం మార్చుతున్నదని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పీఎం పోషణ్గా మార్చారని గుర్తు చేశారు. అంటే పీఎం పేరు ఉండడంతో గౌరవం పెరగాలనీ, కార్మికులు హక్కుల కోసం పోరాడకుండా, బానిసలుగా పనిచేయడమే దాని ఉద్దేశమని విమర్శించారు. అక్షయపాత్ర, ఇస్కాన్ వంటి స్వచ్ఛంద సంస్థలకు మధ్యాహ్న భోజన పథకాన్ని పాలకులు కట్టబెడుతున్నారని అన్నారు. దేశంలోని పౌరులందరికీ విద్యావైద్యం, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసమే కాకుండా ప్రజల జీవితాలను రక్షించడం కోసం పథకాలను కాపాడుకోవాలని కోరారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలతోపాటు మతోన్మాదానికి వ్యతిరేకంగా స్కీం వర్కర్లు, కార్మికులు, రైతులు ఐక్యంగా ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు.