Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో వందల్లో స్క్రబ్ టైఫస్ కేసులు
- చిన్న పురుగు కుడితే వ్యాపిస్తున్న వ్యాధి
- ఎలుకల మూత్రం ద్వారా కూడా వ్యాప్తి..
- జ్వరం, ఒళ్లునొప్పులతో బాధితుల అవస్థలు
- కొందరికి స్తంభిస్తున్న మూత్ర విసర్జన వ్యవస్థ
- అధిక తేమే ఈ పురుగుల వ్యాప్తికి కారణం
- కుట్టిన వెంటనే సంప్రదించాలంటున్న నిపుణులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయప్రతినిధి:
ఈ ఏడాది అధిక వర్షాలకారణంగా వాతావరణంలో తేమ శాతం గణనీయంగా పెరిగింది. దీనివల్ల రకరకాల వ్యాధులు సంభవిస్తున్నాయి. తేమవల్ల చిన్న సైజులో ఉండే పురుగుల వ్యాప్తి అధికమవుతుంది. నల్లుల వంటి కొన్ని రకాల పురుగులతో పాటు ఎలుకల ద్వారా వ్యాపించే క్రిముల వల్ల స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి సోకుతుంది. ఇండ్లు, మంచాలు, పెరటి మొక్కలు, వరి పొలాలు, తడిగా ఉండే ప్రదేశాల్లో ఈ రకమైన పురుగులు ఎక్కువగా సంచరిస్తుంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. స్క్రబ్ టైఫస్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో గతేడాది డిసెంబర్లో 15కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు నెలల కాలంలో వందల సంఖ్యలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనట్టు ప్రయివేటు వైద్యులు చెబుతున్నారు. అధికారికంగా వైద్యఆరోగ్యశాఖ మాత్రం ధృవీకరించకపోయినప్పటికీ ఖమ్మం నగరం వైరారోడ్డులోని జనరల్ ఫిజిషియన్ వైద్యనిపుణులు సౌకర్యం ఉన్న ఐదారు ఆస్పత్రుల్లో మాత్రం పదికి పైగా కేసులు నమోదయినట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోని వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని వివిధ మండలాల నుంచి ఈ రకమైన కేసులు అధికంగా వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
అధిక తేమతో స్క్రబ్ టైఫస్ వ్యాప్తి..
అధిక తేమతోనే స్క్రబ్ టైఫస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఒక్కప్పుడు ఈరకమైన పురుగులు కేరళలోని శబరిమలై పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవని, ఇటీవల కాలంలో స్క్రబ్ టైఫస్ వ్యాప్తి ఇక్కడ కూడా అధికమైందని చెబుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా వీటి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. చూడటానికి చిన్నగా ఉండే పురుగులు నల్లిని పోలి ఉంటాయి. రాత్రి సమయాల్లో ఎక్కువగా సంచరిస్తాయి. ఇవి కుట్టినట్టు కూడా అనిపించదు. కుట్టిన చోట కొద్దిసేపటికి దురద పెట్టడంతో పాటు దద్దుర్లు ఏర్పడుతాయి. శరీరంలో ఎక్కువగా మెత్తదనం ఉన్న ప్రాంతాల్లో కుడతాయి. ఎలుకల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. పొలాల్లో ఎలుకలు బొరియలు చేస్తాయి. ఆ సమయంలో అవి మూత్రవిసర్జన చేయడం ద్వారా పుట్టే క్రిములు బొరియలను పూడ్చే క్రమంలో రైతుల చేతులు, కాళ్లలోకి చేరుతాయి. తద్వారా కూడా ఇది వ్యాపిస్తుందంటున్నారు.
వ్యాధి లక్షణాలు..
ఈ పురుగు కుడితే తీవ్రమైన జ్వరం, ఒళ్లు, కండరాల నొప్పులు వస్తాయి. దగ్గు, ఆయాసం, వాంతులు, తలనొప్పి కూడా ఈ వ్యాధి లక్షణాలు. ఒకరకంగా ఒమిక్రాన్ లక్షణాలు కూడా ఈ వ్యాధిగ్రస్తుల్లో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఈ లక్షణాలు కనిపిస్తే ఒమిక్రానా, స్క్రబ్ టైఫసా అని నిర్థారించుకోవడంలో కొంత గందరగోళ పడుతున్నారని నిపుణులు అంటున్నారు. సకాలంలో వైద్యులను సంప్రదించని కొందరిలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. ఒక్కోసారి మూత్రవిసర్జన వ్యవస్థ కూడా స్తంభిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
స్క్రబ్ టైఫస్‌తో జాగ్రత్త..
స్క్రబ్ టైఫస్ ఓ చిన్నపాటి పురుగు కుట్టడం ద్వారా సోకే జబ్బు. ఈ పురుగు కుట్టిన వెంటనే హాస్పిటల్‌కు రావాలి. సకాలంలో వైద్యం అందిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీయకుండా ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ పురుగుబారిన పడి హాస్పిటల్‌కు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఎలుకల ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. గడిచిన రెండు నెలల వ్యవధిలో మా ఆస్పత్రిలోనే పది మందికి పైగా బాధితులకు వైద్య సేవలందించాం.
- డాక్టర్ నాగుబండి రాజేష్, జనరల్ ఫిజిషియన్, శ్రీ అభయ హాస్పిటల్
కుట్టినట్టు తెలియలేదు.. జ్వరం తగ్గుతూ వచ్చింది..
రోజూ పొలం పనులు చేస్తుంటాను. పురుగు కుట్టినట్టు కూడా ఏమి అనిపించలేదు. తరచూ జ్వరం వచ్చి పోతుండటంతో సంబంధిత ట్యాబ్లెట్లు వాడాను. పదిరోజుల పాటు వాడినా జ్వరం తగ్గలేదు. మూత్రవిసర్జన కూడా మందగించింది. దాంతో మధిరలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి వెళ్తే క్రియాటిన్ టెస్ట్ చేస్తే 6.8 మాత్రమే ఉన్నట్టు తేలింది. డయాలసిస్ చేయాలని అనడంతో ఆందోళనకు గురయ్యా. ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లా. అక్కడి వైద్యులు రంజిత్ రావెళ్ల పరీక్షించారు. బొడ్డు కింది ప్రాంతంలో ఏదో కుట్టినట్టు ఉందని చెప్పాను. పరీక్షించి స్క్రబ్ టైఫస్‌గా నిర్ధారించారు. దానికి సంబంధించిన మందులు ఇచ్చారు. డయాలసిస్ వంటివి లేకుండా మూడురోజుల్లోనే వ్యాధి నియంత్రణలోకి వచ్చింది.
- గంటా చిన్న శ్రీనివాసరావు, ములుగుమాడు, ఎర్రుపాలెం మండలం