Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- వరంగల్
మునుగోడులో బీజేపీ పన్నిన కుట్ర విఫలం కాబోతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా సీపీఐ(ఎం) కార్యకర్తల శిక్షణా తరగతులను నగరంలోని పెద్దమ్మగడ్డ ఐకె గార్డెన్లో తమ్మినేని ప్రారంభించారు. పెద్దమ్మగడ్డలోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేశారు. అనంతరం డప్పు వాయిద్యాలతో పెద్దమ్మగడ్డ నుంచి ఐకే గార్డెన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. తొలుత ఆ పార్టీ సీనియర్ నాయకులు సారంపల్లి వాసుదేవారెడ్ది జెండావిష్కరణ చేశారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ.. మునుగోడులో వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి 15 వేల మెజార్టీతో గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేయాలనేది ఆయన సొంత నిర్ణయం కాదని, ఆయన్ని బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించి టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే వాతావరణం సృష్టించాలని కుట్ర పన్నారని తెలిపారు. కానీ వారి వ్యూహం బొక్కబోర్ల పడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చి అక్రమంగా బీజేపీ అధికారంలోకి రావాలని అనేక కుట్రలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికలు వచ్చాయని తెలిపారు. ఆర్థిక స్థితి బలంగా ఉన్న వాళ్ళను వాడుకుంటూ అధికారంలోకి రావాలని చూస్తోందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేసిందన్నారు. ప్రజాస్వామ్యం బతకాలంటే బీజేపీని అన్ని రంగాల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్రంలో పొడు భూముల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. శిక్షణా తరగతుల్లో సీపీఐ(ఎం) హన్మకొండ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి, జిల్లా కమిటీ సభ్యులు వాంకుడోతూ వీరన్న, గొడుగు వెంకట్, మంద సంపత్, భాను నాయక్, కె. లింగయ్య, దీప, నార్త్ కమిటీ కార్యదర్శి గాదె రమేష్ తదితరులు పాల్గొన్నారు.