Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ నిర్ణయం
- బీజేపీ దాడి తీవ్రమైన నేపథ్యంలో జాగరూకతతో ఉండాలంటూ హెచ్చరిక
- ఎమ్మెల్యేల భద్రత పెంపు.. బుల్లెట్ ప్రూఫ్ కార్ల కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చేసిన తప్పును ఒప్పు కోకుండా పదే పదే తప్పుడు మాటలు, చర్యలకు పాల్పడు తున్న బీజేపీ పట్ల తమ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలంటూ టీఆర్ఎస్ అధినేత ఆదేశించారు. ముఖ్యంగా బేరసారాల వ్యవహారంలో మఠాధిపతులను పోలీసులకు పట్టించిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు మరింత జాగరూకతతో వ్యవహరించాలని గులాబీ బాస్ దిశా నిర్దేశం చేశారు. బీజేపీ కోవర్టులతోపాటు కేంద్ర నిఘా సంస్థలు వారిని అనుక్షణం వెంటాడుతుంటాయన్న సంకేతాల నేపథ్యంలో ఆయన ఈ రకమైన ఆదేశాలను జారీ చేసినట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఆపరేషన్‌ను విజయవంతంగా ముగించారని చెబుతున్న పైలెట్ రోహిత్‌రెడ్డి, బీరం హర్షవర్థన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావుకు ఇప్పుడున్న భద్రతను పెంచటంతోపాటు వారందరికీ బుల్లెట్ ప్రూఫ్ కార్లను ప్రభుత్వం కేటాయించింది. వీరిలో గువ్వల, రేగా ఇద్దరూ ప్రభుత్వ విప్‌లుగా ఉన్న సంగతి విదితమే. వారితోపాటు ఇప్పుడు మిగతా ఇద్దరికీ మంత్రుల స్థాయి సెక్యూరిటీని కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశాలిచ్చింది. హైదరాబాద్‌లోని ఆ నలుగురి ఇండ్లతోపాటు వారి సొంతూళ్లలోనూ భద్రతను పెంచింది. మరోవైపు రాష్ట్ర రాజధానితోపాటు ఎక్కడికెళ్లినా విధిగా బుల్లెట్ ప్రూఫ్ కార్లనే వాడాలంటూ సూచించింది.
ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు, బీజేపీయేతర ప్రభుత్వాల పట్ల ఆ పార్టీ అనుసరిస్తున్న ధోరణిని చూసిన తర్వాత ఆ నలుగురి వ్యవహారంలో సీఎం ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారంటూ టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ ప్రగతి భవన్‌లోనే ఉన్న వారు... మున్ముందు ప్రజా జీవితంలోకి వెళ్లాల్సి ఉంటుందనీ, జనాల్ని కలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా చూసేందుకే భద్రత పెంచినట్టు ఆయా వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో మునుగోడు సభలో నలుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ ప్రవేశపెట్టి.. వాస్తవాలు బయటపెట్టిన తర్వాత కూడా కమలం పార్టీ నేతల ఎదురుదాడి కొనసాగుతుండటం, గురువారం నాటి సీఎం ప్రెస్‌మీట్ తర్వాత కూడా వారు ఆత్మ విమర్శ చేసుకోకపోవటాన్నిబట్టి తమ ఎమ్మెల్యేల పట్ల, ప్రభుత్వం పట్ల భవిష్యత్తులో కూడా బీజేపీ దేనికైనా తెగించేందుకు వెనకాడబోదనే అంచనాకు ముఖ్యమంత్రి వచ్చారు. బేరసారాల తతంగానికి సంబంధించిన ఆడియోలు, వీడియోలను ఆయన బయటపెట్టినప్పటికీ... బీజేపీ నేతలు వాస్తవాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఎమ్మెల్యేలే లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టటాన్ని కూడా సీఎం పరిగణనలోకి తీసుకున్నట్టు వినికిడి. ఈ నేపథ్యంలో బీజేపీతోపాటు కేంద్ర ప్రభుత్వం, అక్కడి నిఘా సంస్థలు, వేగులతో వారికి ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురు కావచ్చనే ఉద్దేశంతోనే భద్రతను మరింతగా పెంచినట్టు అధికారిక వర్గాలు వివరించాయి.