Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షోకాజ్ నోటీసు అందలేదని బుకాయింపు
- రెండోసారి షోకాజ్ నోటీసులు
- సమాధానమిచ్చినట్టు మీడియాకు లీకులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై వేటు తప్పదా? ఆయన్ను సస్పెండ్ చేసేందుకు ఏఐసీసీ అధిష్టానం సిద్ధమవుతుందా? అనే చర్చ జోరుగా సాగుతున్నది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న తాజా పరిణామాలు ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. 'మునుగోడు ఎన్నికల ప్రచారానికి పోకపోవడం, తమ్ముడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటువేయాలని చెప్పడం, రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు, మునుగోడులో కాంగ్రెస్ గెలవదు. అందుకే నేను ప్రచారానికి వెళ్లడం లేదు' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలంరేపాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఆయనకు షోకాస్ నోటీసు జారీ చేసింది. పదిరోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అయితే తనకు నోటీసు అందలేదంటూ ఆయన బుకాయించినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోసారి ఆయనకు షోకాసు నోటీసు పంపినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చినట్టు లీకులిచ్చారు. ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఆయన ఆస్ట్రేలియా పర్యటనకు పోవడంతో ఆయనపై అనుమానాలు పెరిగాయి. ఆస్త్రేలియా నుంచి నగరానికి చేరుకున్న ఆయన...పార్టీ ప్రతిష్టాత్మంగా చేపట్టిన భారత్ జోడో యాత్రలోనూ పాల్గొనడం లేదు. మరో మూడు రోజులు మాత్రమే తెలంగాణలో యాత్ర కొనసాగుతున్నది. అయినప్పటికీ ఆయన చడిచప్పుడు లేకుండా ఉన్నారు. దీంతో ఆయనపై పార్టీ సీరియస్‌గా ఉన్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఏఐసీసీకి సంతృప్తికరమైన సమాధానం చెప్పకపోతే ఆయన్ను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదే అంశంపై సోషల్‌మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అది ఫేక్ ఆడియో...ఆ వాయిస్ నాది కాదు : వెంకట్‌రెడ్డి
ఏఐసీసీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ నెల 1న సీల్డ్ కవర్లో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి సమాధానం ఇచ్చినట్లు సమాచారం. 'అది ఫేక్ ఆడియో. ఆ వాయిస్ నాది కాదు.. మార్ఫింగ్ చేసింది. పార్టీలో నేను చాలా సీనియర్ నేతను. ఎన్ఎస్యూఐ విద్యార్థి విభాగం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. గడిచిన 35 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పని చేస్తున్నాను. నా సీనియార్టీకి పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు' అంటూ ఆయన వివరణ ఇచ్చినట్టు తెలిసింది. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి బీజేపీకి ఓటు వేయాలని మునుగోడు కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసి చెప్పడంపై ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ గత నెల 22న వెంకట్‌రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చింది. 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై ఈ నెల 1న సీల్డ్ కవర్లో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి సమాధానం ఇచ్చినట్లు సమాచారం.