Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరలు నిర్ణయించాలనీ, పంటలన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆల్ ఇండియా కిసాన్-మజ్దూర్ సభ (ఏఐకెఎంఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాయల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ప్రధాన పంటలు పత్తి, వరి వస్తుండగా, మొక్కజొన్నలు వచ్చాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల కొనుగోలుకు చర్యలు చేపట్టటంలో వెనుకబడ్డాయనీ, మార్కెట్లు ఓపెనింగ్ కూడా పూర్తి స్థాయిలో జరగలేదని తెలిపారు. క్వింటాల్ వరి ఉత్పత్తి ఖర్చు సాధారణ రకాలకు రూ.4,512, ఫైన్ రకాలకు రూ.4,605 అవుతుంటే కేంద్రం అంత కంటే తక్కువగా రూ,2,040, రూ.2060గా నిర్ణయించి రైతును నష్టాల పాల్జేస్తున్నదని విమర్శించారు. వెంటనే పంటల కొనుగోలుకు చర్యలు చేపట్టాలనీ, రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇచ్చి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు.