Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహరంలో సీఎం కేసీఆర్ బయట పెట్టిన వీడియోల ఆధారంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బిఎల్ సంతోష్‌పై కేసులు నమోదు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేయడంలో వారి పాత్ర ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వీడియోల ఆధారంగా ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలను పడగొట్టడానికి జరిగిన కుట్రపై ఆయా రాష్ట్రాల హైకోర్టులు సూమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని కోరారు. ఇప్పటికే ఈ వీడియోలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, అన్ని రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులకు పంపినట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారని పేర్కొన్నారు. తక్షణమే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి మరింత పదును పెట్టాలనీ, ఫిరాయింపుదారులపై చర్యల విషయంలో చట్ట సభల స్పీకర్, చైర్మెన్ కేంద్ర ఎన్నికల సంఘాలను జవాబుదారీ చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని సూచించారు.