Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉచిత విద్యుత్ పథకం సబ్సిడీ బిల్లుల బకాయిలను వెంటనే చెల్లించాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లోని ఆ సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడిరాజు నరేష్ అద్యక్షతన రాష్ట్ర కమిటి సమావేశం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జీ.వో నెంబర్ 2 ప్రకారం 250 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన బిల్లుల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ఐదు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ బోర్డుకు బిల్లులు చెల్లించని కారణంగా కింది స్థాయి విద్యుత్ అధికారులు రజకుల లాండ్రీషాపుల వద్దకొచ్చి కరెంటు బిల్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. కొన్నిచోట్ల కనెక్షన్లు తోలగిస్తున్నారని తెలిపారు. తీవ్ర ఒత్తిడి చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. సమస్యను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలనీ, సబ్సిడీబకాయిలు చేల్లించాలని డిమాండ్ చేశారు. బీసీ (ఎ)రిజర్వేషన్ పరిరక్షణకు సంఘాలన్నీ ఐక్యంగా పోరాడి రిజర్వేషన్లను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. జీ.వో నెంబర్ 190 ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ వెంటనే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చిటికన ముసలయ్య, రాష్ట్ర నాయకులు,సి.మల్లేష్, జ్యోతి ఉపేందర్, పావురాల రాములు,ఏదునురి మదర్, గోపాల్, శాలీశ్వర్,సి.వెంకటస్వామి, శోభ,రాములు, భాస్కర్, రాంబాబు, వివిధ జిల్లాల నుండి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.