Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్, హిమాచల్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు
- బీజేపీ వ్యతిరేక ప్రచారంలో పాల్గొననున్న నేతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం దగ్గరి నుంచి బీజేపీపై ఒంటి కాలి మీద లేస్తున్న అధికార టీఆర్ఎస్... ఆ పార్టీని మరింత రచ్చకీడ్చాలని నిర్ణయించింది. ఇప్పటిదాకా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి... తెలంగాణలో సైతం ఎమ్మెల్యేల బేరసారాలకు తెరలేపిన బీజేపీ బండారాన్ని ఇతర రాష్ట్రాల్లో సైతం బయటపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. త్వరలో ఎన్నికలు నిర్వహించనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ను ఇందుకు వేదికగా ఎంచుకున్నట్టు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వెలువడిన అనంతరం బీఆర్ఎస్ (టీఆర్ఎస్)కి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడిన బృందం ఆయా రాష్ట్రాలకు క్యూ కట్టనుంది. అక్కడి ఎన్నికల సభల్లో వారు పాల్గొని, ప్రసంగించనున్నారని తెలంగాణ భవన్ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా బీజేపీ అడ్డగోలు వ్యవహారాలకు తెరలేపుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వైనాన్ని వారు ఆ సందర్భంగా ఏకరువు పెట్టనున్నారు. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాల కూల్చివేత, తెలంగాణలో ఇటీవల మఠాధిపతుల రూపంలో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించటం, సీఎం కేసీఆర్ ఆడియో, వీడియోలను బయట పెట్టిన తీరును ఓటర్లకు వివరించనున్నారు. తద్వారా బీజేపీని వెనక్కు కొట్టాల్సిన ఆవశ్యకతను వారు నొక్కి చెబుతారని టీఆర్ఎస్కు చెందిన ఓ నేత వ్యాఖ్యానించారు. గుజరాత్, హిమాచల్ వెళ్లేందుకు వీలుగా ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలకు విమాన టిక్కెట్లు బుక్ చేసినట్టు సమాచారం.