Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి
- టీఎస్టీసీఈఏ అధ్యక్షులు సంతోష్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల మెమోల ముద్రణలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఎస్టీసీఈఏ) అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ విమర్శించారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే పదో తరగతి విద్యార్థులకు మెమోలను జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఫలితాలు విడుదలై నాలుగు నెలలు కావస్తున్నా మెమోల జారీకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఎస్ఈ)కి ఇంత సమయం ఎందుకు పడుతున్నదని ప్రశ్నించారు. పదో తరగతి పరీక్షల ఫలితాలు జూన్ 30న విడుదలయ్యాయనీ, ఇందులో 5,03,579 మంది విద్యార్థులు రెగ్యులర్ హాజరైతే అందులో 4,53,201 మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 38,477 మంది పాసయ్యారనీ, ఆ ఫలితాలను సెప్టెంబర్ ఒకటిన విడుదల చేశారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,91,678 మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందితే వారి మార్కుల మెయిన్ మెమో జారీ చేయకపోవడంతో ఉన్నత చదువులకు వెళ్లే వారికి ధ్రువపత్రాల పరిశీలన సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు, విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెమోలను త్వరగా జారీ చేయాలని కోరారు.