Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగతిభవన్‌లో చూపిన సినిమా పేరు ''నేనింతే-నా బతుకింతే''
- ఎమ్మెల్యేల కొనుగోళ్లపై బండి సంజయ్ నిష్ఠూరాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి దొంగ ఆర్టిస్టులను తయారు చేసుకుని, ''నేనింతే-నా బతుకింతే'' అనే సినిమాను ప్రగతిభవన్‌లో చూపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హేళనగా మాట్లాడారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా సీఎం కేసీఆర్ అనీ, గురువారం ఆయన ప్రెస్‌మీట్ పెట్టి జాతీయ స్థాయిలో సానుభూతి పొందేందుకు ప్లాన్ చేశారని విమర్శించారు. రాష్ట్రంలో 37 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్ని కొన్నట్టు కొని ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఏంటని ఎద్దేవా చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమవేశంలో బండి సంజయ్ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేకుంటే సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణకు భయమెందుకని ప్రశ్నించారు. లిక్కర్ కేసు ఢిల్లీలో నమోదైందనీ, సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోలేరనీ, తన బిడ్డ అరెస్టు అవుతుందనే పక్కా సమాచారం రావడంతో ఈ డ్రామాకు తెరలేపారని అన్నారు. ఇప్పటికే ఒకసారి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఓఎల్ఎక్స్ పీస్ లనీ, వారిని హీరోలుగా చూపుతూ చేసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. కేసు పంచనామా కూడా ముందే రాసుకొచ్చి, సంతకాలు తీసుకున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ డ్రగ్స్ కేసు, కాళేశ్వరం, నయీం డైరీ, మియాపూర్ భూముల ఫైల్స్ సినిమాలు కూడా తీయబోతున్నరని అన్నారు. అమ్ముడుపోవడానికి సిద్ధమైన నలుగురు ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ఏకైక దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.