Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జై భగవాన్, ప్రధాన కార్యదర్శి, మిడ్ డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాజకీయ అవసరాలకు ప్రజా పోరాటాలను అనుసంధానం చేస్తే మెరుగైన ఫలితాలు సాధించొచ్చని హర్యానా మధ్యాహ్నా భోజన కార్మికుల అందోళనలు నిరూపించాయంటూ ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, హర్యానా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జై భగవాన్ అభిప్రాయపడ్డారు. సమాఖ్య జాతీయ మహాసభల సందర్భంగా శుక్రవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తమ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల పోరాట ఫలితాలను ఆయన 'నవతెలంగాణ'తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
''హర్యానాలోని 22 జిల్లాల్లో 28వేల మంది మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ సమాఖ్య కమిటీలు ఉన్నాయి. 2009లో వీరి ఆందోళనలు ప్రారంభానికి ముందు వారి వేతనం వెయ్యి రూపాయిలు. 2012 వరకు వరుస ఆందోళనలు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.150 వేతనం పెంచింది. 2013లో మరోసారి జరిగిన ఉద్యమంతో వారి వేతనం రూ. 3 వేలకు పెరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో అశావర్కర్లు, అంగన్వాడీల ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగాయి. ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో వారి వేతనాలు పెంచింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మధ్యాహ్న భోజన కార్మికులు మరోసారి పోరుబాట పట్టారు. ఈసారి వారి వేతనం మరో రూ.4 వేలు పెరిగి, మొత్తం రూ.7వేలకు చేరింది. ఆశాలు, అంగన్వాడీల పోరాటాల కొనసాగింపును మధ్యాహ్న భోజన కార్మికులు సంఘటితంగా అందిపుచ్చు కోవడంతో ఇది సాధ్యమైంది. అదే సందర్భంలో అక్కడి రాజకీయపార్టీలకు ఓట్లు కావాలి కాబట్టి, వారి డిమాండ్లు తీర్చక తప్పలేదు. స్కీం వర్కర్లను ప్రభుత్వాలు కార్మికులుగా గుర్తించేందుకు సిద్ధంగా లేవు. అందునా మహిళలు అంటే చిన్నచూపు. కానీ సీఐటీయూ అండతో క్షేత్రస్థాయిలో జరిగిన ఆందోళనలు వారిలో ఐక్యతను పెంచాయి. దాని ఫలితంగా ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే అత్యధికంగా హర్యానా మధ్యాహ్న భోజన కార్మికులు రూ.7వేలు వేతనం అందుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్లో 4.34 లక్షల మంది, మధ్యప్రదేశ్లో 2.74 లక్షలు, పశ్చిమ బెంగాల్లో 2.34 లక్షల మంది మధ్యాహ్న భోజన కార్మికులు పని చేస్తున్నారు. వారందరికీ చాలా తక్కువ వేతనాలు ఉన్నాయి. స్కీం వర్కర్ల మూవ్ మెంట్ పెంచగలిగితే, దాన్ని అంది పుచ్చుకొని, అందరూ ఐక్య పోరాటాల్లోకి రావడం వల్ల ప్రయోజనాలు పొందగలుగు తారు. దానికి హర్యానా ఉద్యమాలే ప్రత్యక్ష ఉదాహరణ. దేశం మొత్తంలో 26 లక్షలకు పైగా స్కీం వర్కర్లు ఉన్నారు. అయితే వారందరినీ సంఘటితం చేయడం సాధారణ విషయం కాదు. కానీ సాధిస్తామనే విశ్వాసం ఉంది''.