Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ డాక్టర్లు, హెచ్ఆర్ డీఏ విమర్శలు సరికావు
- ఆర్ఎంపీ, పీఎంపీ, కమ్యూనిటీ పారామెడిక్స్ ఎక్స్పీరియన్స్డ్ ప్రాక్టీషనర్స్ సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ అనుమతి మేరకు ప్రథమ చికిత్స అందిస్తున్న తాము నకిలీ డాక్టర్లు, దొంగ డాక్టర్లం ఎలా అవుతామంటూ తెలంగాణ స్టేట్ ఆర్ఎంపీ, పీఎంపీ కమ్యూనిటీ పారామెడిక్స్, ఎక్స్ పీరియన్స్డ్ ప్రాక్టీషనర్స్ సంఘం ప్రశ్నించింది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, ఆర్ఎంపీ ఎస్.వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, కొంత మంది అవగాహన లేకుండా తమపై కువిమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వ ఉత్తర్వులు, బడ్జెట్ కేటాయింపులు, శిక్షణ, సర్టిఫికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని దాదాపు 50 వేల మంది ఆర్ఎంపీ, పీఎంపీల మనోభావాలను దెబ్బతీసే విధంగా సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీలను గుర్తిస్తామనీ, శిక్షణ ఇస్తామని టీఆర్ఎస్ హామి ఇచ్చిందని తెలిపారు. 14 రకాల బృందాలతో కూడిన కమిటీ సరే అని చెప్పిన తర్వేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 2008లో ప్రభుత్వ ఉత్తర్వులిచ్చారనీ, తమకు అనుమతించిన ఆ 14 గ్రూపుల్లో జూడాల ప్రతినిధులు కూడా ఉన్నారని తెలిపారు.
ఆనాడు తమకు పరిమితుల మేరకు అనుమతించేందుకు సరే అని చెప్పిన జూనియర్ డాక్టర్లు...నేడు కాదనడానికి కారణమేంటని ప్రశ్నించారు. చాలా మంది తమపై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ తెలియనితనంతో డిమాండ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఆ చట్టం తమకు వర్తించదని స్పష్టం చేశారు. గతంలో శిక్షణ ఇచ్చిన కొంత మందికి సర్టిఫికెట్లు అందలేదని తెలిపారు. ఇంతటి నేపథ్యం ఉన్న తాము సమావేశం పెట్టుకోకుండా హెచ్ఆర్డీఏ (హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్) తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయడం సబబు కాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా ఎక్కడైనా సమావేశాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటికీ డాక్టర్లను తమ గురువులుగానే భావిస్తామనీ, అదే విధంగా తమ పట్ల గౌరవాన్ని కోరుకుంటున్నామని చెప్పారు.
కోట్ల రూపాయలు సంపాదించాలనే కోరికలు...లక్షాధికారులం కావాలనే ఆశలు తమకు లేవని ఎద్దేవా చేశారు. ప్రతి వ్యవస్థలోనూ ఆర్ఎంపీ, పీఎంపీల్లోనూ లోపాలున్నట్టే కొంత మంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనీ, అలాంటి వారిపై చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. అంతే గానీ ఒకరిద్దరిని సాకుగా చూపించి అర్థరహిత విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
తమపై విమర్శలు చేస్తున్న జూనియర్ డాక్టర్లతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జాఫర్, కార్యదర్శి శివరాజ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు బాలక్రిష్ణారెడ్డి, మౌలానా, శేరిలింగంపల్లి అధ్యక్షులు పి.శ్రీనివాస్, పి.శివసాయిలు, కార్యదర్శి అనిల్ కుమార్, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్, దిలీప్ కుమార్, సుధాకర్, అనిల్ కుమార్, సదానందం తదితరులు పాల్గొన్నారు.