Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు టీఎస్‌జీసీసీఎల్‌ఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాకుల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. జీవో నెంబర్ 16 ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు/ అధ్యాపకులను క్రమబ ద్ధీకరించడానికి ప్రభుత్వం సమాచారాన్ని సేకరిం చిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించడానికి గత ఐదు నెలల నుంచి ప్రిన్సిపాళ్ల నుంచి కమిషనర్ స్థాయి వరకు సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి సమర్పిం చారని తెలిపారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ ఆలస్యం జరగడంతో కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాలు మానసిక ఆవేదనకు గురవుతున్నా యని పేర్కొన్నారు.
దీన్ని గమనించి ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రిని కోరారు. కాంట్రాక్టు అధ్యాపకులందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇదే విషయంపై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్‌ను కలిశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వస్కుల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కె శ్రీనివాస్, నగేష్, భాస్కర్, మూర్తి, రాజు, రాఘవేంద్ర, మదార్ తదితరులు పాల్గొన్నారు.