Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంబీబీఎస్, బీడీఎస్ ఆశావహ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వారంతా ఎంబీబీఎస్, బీడీఎస్ చదవాలనుకుంటున్నారు. ఎన్సీసీ కోటాలో దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్ మొదటి దఫా కౌన్సిలింగ్‌ను పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్సీసీ అభ్యర్థుల కోసం ఒక శాతం సీట్లు కేటాయించినప్పటికీ వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి కాకపోవడంతో సీట్లు పొందలేకపోయారు. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్సీసీ డైరెక్టరేట్‌ను సంప్రదించగా, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వద్దే పెండింగ్ ఉన్నాయనే సమాధానం వచ్చినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, శనివారం ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీన రెండో దఫా కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందనీ, ఈ లోపు ఎన్సీసీ ప్రాధాన్యతా జాబితాను సమర్పించాలనీ, లేకపోతే తదుపరి మాపప్ రౌండ్లో ఎన్సీసీ కోటా కింద మిగిలిన సీట్లను ఒసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు కలుపుతామని స్పష్టం చేసింది. విభాగాల మధ్య సమన్వయలోపంతో తమ పిల్లలకు అన్యాయం జరుగుతున్నదనీ, వెంటనే వెరిఫికేషన్ పూర్తి చేసి న్యాయం చేయాలని ఎన్సీసీ విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.