Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు
- ఇంజినీరింగ్ కాలేజీలకు టీఏఎఫ్ఆర్సీ హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా కింద ఉన్న సీట్లను మెరిట్ లేకుండా విద్యార్థులకు ఇస్తే రూ.10 లక్షల జరిమానా విధిస్తామని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులరేటరీ (టీఏఎఫ్ఆర్సీ) హెచ్చరించింది. నిబంధనలకు విరుద్ధంగా సీట్లు కేటాయించినా, అధికంగా ఫీజులు వసూలు చేసినా ఆయా కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్ జస్టిస్ పి స్వరూప్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్ ఎం మంజూర్ హుస్సేన్ తదితరులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పలు ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజు కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. సీఎస్ఈ వంటి కోర్సులకు డొనేషన్ పేరుతో ఎక్కువ ఫీజు తీసుకుంటున్నట్టు వారి దృష్టికి వచ్చింది. దీంతో ఆ కమిటీ సమావేశమై పలు అంశాలపై చర్చించింది. అనంతరం స్వరూప్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. జీవోనెంబర్ 37లో పేర్కొన్న ఫీజు కంటే ఎక్కువ ఫీజు వసూలు చేస్తే, ఒక్కో స్టూడెంట్‌పై రూ.రెండు లక్షల జరిమానా విధిస్తామని తెలిపారు. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇప్పించనున్నట్టు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో బీ కేటగిరి సీట్లను విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులను పట్టించుకోకుండా, మెరిట్ ప్రకారం కాకుండా నిబంధనలకు విరుద్ధంగా సీట్లు కేటాయిస్తే ఒక్కో అడ్మిషన్‌కు రూ.10 లక్షల జరిమానా విధిస్తామని యాజమాన్యాలను హెచ్చరించారు. ఆ మొత్తాన్ని యాజమాన్యాల నుంచే వసూలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అడ్మిషన్లనూ తొలగించనున్నట్టు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే బీ కేటగిరీ సీట్లను కేటాయించాలనీ, అధిక ఫీజులను వసూలు చేయొద్దని కోరారు.