Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడులో విజయంపై టీఆర్ఎస్ ధీమా
- సంబురాలకు సన్నాహాలు
- తెలంగాణ భవన్‌కు క్యూ కట్టనున్న నేతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఆదివారం తేలనుండటంతో అక్కడ భారీ విజయంపై టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. తద్వారా బీజేపీ తీసుకొచ్చిన ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలో మరో మలుపునకు నాంది పలకనుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో గెలుపు సంబురాలకు కార్యకర్తలు సర్వం సిద్ధం చేశారు. వీటికి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ భవన్ వేదిక కానుంది. ఉదయం 11 గంటల వరకూ విజేత ఎవరనేది తేలిపోనుండటంతో ఆ సమయానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఆ భవన్‌కు చేరుకోవాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. దాదాపు 25 వేల పై చిలుకు ఓట్లతోనే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి గెలవబోతున్నారంటూ ఆ పార్టీ సీనియర్లు చెబుతుండటం గమనార్హం.
అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచే అవకాశముండటంతో గులాబీ పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాయి. ఈ ఉత్సాహాన్ని, ఊపును భవిష్యత్తులో కూడా కొనసాగించాలంటూ సీఎం కేసీఆర్... క్యాడర్‌కు మార్గదర్శనం చేశారు. ఈ జోష్‌ను రానున్న అసెంబ్లీ (2023 డిసెంబరు) వరకూ కంటిన్యూ చేయాలనీ, తద్వారా ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలంటూ ఆయన పలు అంతర్గత సమావేశాల్లో చెప్పినట్టు వినికిడి. దీంతోపాటు ఎమ్మెల్యేల బేరసారాలకు పాల్పడ్డ బీజేపీ అడ్డగోలు వ్యవహారాలను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఎండగట్టాలంటూ ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమల్జేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. తద్వారా పార్టీని, ప్రభుత్వాన్నీ సుస్థిరం చేయాలని ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు. ఇందుకోసం మునుగోడు ఉప ఎన్నిక తమకు బాగా ఉపయోగపడిందని సీఎం తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం.