Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రమాదపుటంచున పడిన భారతదేశాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. శనివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో 'ఆలోచనాపరుల వేదిక - భారత్ బచావో' నాయకులు డాక్టర్ ఎం.గోపీనాథ్, ప్రొఫెసర్ పీ.ఎల్.విశ్వేశ్వర్ రావు, రిటైర్డ్ టీచర్ సోమన్న, రచయిత స్కైబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు 'భారత్ బచావో ' అనే అంశంపై మేధోమధన సదస్సు నిర్వహించనున్నామని తెలిపారు.
ఈ సదస్సులో మేధావులతో పాటు ఆయా రాజకీయ పార్టీల నాయకులు పాల్గొంటారని చెప్పారు. దేశంలో సమాఖ్య భావన దెబ్బతింటున్నదనీ, రాజ్యాంగ స్ఫూర్తితో పాలన జరగడం లేదనీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫాసిస్టు ధోరణికి రాష్ట్ర ప్రభుత్వాలు వణికిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సామాజిక, మత సామరస్యతను పరిరక్షించాల్సిన అవసరముందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 1933లో జర్మనీ నాజీల వశమైనప్పుడు అక్కడ నెలకొన్న పరిస్థితులే ప్రస్తుతం భారతదేశంలో ఉన్నాయనీ, ఈ స్థితి నుంచి దేశాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లౌకికవాదాన్ని పరిరక్షించేందుకు వచ్చే అన్ని శక్తులను కలుపుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని తెలిపారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే అవకాశం కోసం బీజేపీ కాచుకుని కూర్చుందనీ, దాన్ని వ్యతిరేకించే శక్తులన్ని కలిసి రావాలని పిలుపునిచ్చారు.