Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవిష్యత్ పోరాట కార్యాచరణ ప్రకటన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్లో శుక్ర, శనివారాల్లో నిర్వహించిన మిడ్డేమీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎమ్డీఎమ్డబ్ల్యూఎఫ్ఐ) జాతీయ రెండో మహాసభ విజయవంతంగా ముగిసింది. సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో (మల్లు స్వరాజ్యం మంచ్లోని రంజనా నీరులా నగర్లో) జరిగిన ఈ మహాసభ దేశంలోని 26 లక్షల మంది మధ్యాహ్న భోజన కార్మికుల ప్రాథమిక హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చింది. ఇప్పుడు నెలకు రూ.1000 మాత్రమే చెల్లిస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, పెన్షన్ కోసం 11 డిసెంబర్ 2022న దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్ డే నిర్వహించనున్నట్టు ప్రకటించింది. 2023 జనవరి 6ను స్కీం వర్కర్ల అఖిల భారత నిరసన దినంలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దాని పేరును పీఎం పోషణ అని మార్చడాన్ని తప్పుబట్టింది. ఎమ్డీఎమ్డబ్ల్యూఎఫ్ అధ్యక్షులు ఎస్.వరలక్ష్మి అరుణపతాకాన్ని ఆవిష్కరించి మహాసభను ప్రారంభించగా...తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ వందన సమర్పణతో ముగిసింది. మహాసభ తొలిరోజు సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఎఆర్.సింధు ప్రారంభసభలో ముఖ్య వక్తగా మాట్లాడారు. అనంతరం ఆహ్వానం సంఘం చైర్మెన్, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రతినిధులనుద్దేశించి తన సందేశాన్ని ఇచ్చారు. శనివారం సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఎం.సాయిబాబు ముగింపు సందేశాన్ని ఇచ్చారు. చిన్నారులు పౌష్టికాహారలోపం, ఆకలితో అలమటిస్తున్నప్పటికీ ఈ పథకాన్ని వర్గీకరణ చేసి ప్రయివేటీకరించాలని చూస్తున్న కేంద్రంలోని కార్పొరేట్ మతతత్వ బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ పోరాటాలను మరింత ఉధృతం చేయాలని మహాసభ నిర్ణయించింది. పలు తీర్మానాలను చేసింది. అస్సాం, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి దాదాపు 260 మంది ప్రతినిధులు ఈ మహాసభలో పాలుపంచుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పోరాట స్ఫూర్తితో మహాసభ ప్రతినిధులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లారు.