Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మీజెల్స్, రుబెల్లా (తట్టు, అమ్మవారు) తదితర అంటు వ్యాధులను రూపుమాపాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు ఆదేశించారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అలాంటి కేసులను వెంటనే గుర్తించి, చికిత్సనందించి నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆశాలు, ఏఎన్ఎంల పనితీరుపై నెలవారీ సమీక్షలో భాగంగా శనివారం ఆయన హైదరాబాద్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ల నూతన భవన నిర్మాణాలు, మరమ్మతుల కోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నట్టు తెలిపారు. అత్యల్పంగా ఓపీ నమోదవుతున్న జిల్లాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫారం (ఐహెచ్ఐపీ)లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలనీ, ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తున్నదని హెచ్చరించారు. టీబీ బాధితులకు మద్దతు ఇచ్చేందుకు వీలుగా దాతలను ఆహ్వానించాలని, నిక్షరు మిత్రగా నమోదు చేయించేందుకు జిల్లా వైద్యాధికారులు చొరవ చూపాలని ఆదేశించారు. టెలి కాన్ఫరెన్స్లో కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్నారు.