Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు రైతులకు, అటవీ శాఖ అధికారుల మధ్య గొడవ
- రైతుల ఆందోళన
- భారీగా మోహరించిన పోలీసులు
- 144 సెక్షన్ అమలు
- భూములు లాక్కుంటే ప్రతిఘటన తప్పదు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-బూర్గంపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సోంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బుడ్డగుడెం గ్రామంలో శనివారం మరోసారి పోడు రగడ మొదలైంది. అటవీశాఖ అధికారులకు, పోడు రైతులకు మధ్య మరోసారి గొడవ నెలకొంది. గ్రామంలోని పోడు రైతులు ఫారెస్ట్ భూముల్లోని మొక్కలను తొలగించారని ఆ శాఖ అధికారులు పెద్దఎత్తున ఆ ప్రాంతంలో మోహ రించారు. ఈ సమయంలో పోడు రైతులు.. తాము సాగు చేసుకుంటున్న భూములను అటవీ శాఖ అధికారులు బలవంతంగా లాక్కుంటున్నారని, తమ కు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. దాంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సమయంలో ఆందోళనలు వద్దని అటవీ శాఖ కార్యాలయం వద్ద కూర్చొని అందరం మాట్లాడు కుందామని కొందరు అధికారులు పేర్కొన్నప్పటికీ పోడు రైతులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. అదే విధంగా పోడు భూముల్లోని ఎండిపోయిన మొక్కలను తగలబెడదా మని రైతులు ప్రయత్నించగా అధికారులు అడ్డు కున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులకు, పోడు రైతులకు స్వల్ప వాగ్వివాదం జరిగింది. పాల్వంచ సీఐ నాగరాజు నేతృత్వంలో బూర్గంపాడు అదనపు ఎస్ఐ రమణారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. చివరకు పోడు రైతులు ఆందోళన విరమించారు.
కాగా భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ, మణుగూరు నుంచి 180 మంది అటవీ శాఖ అధికారులు సిబ్బంది తరలివచ్చారు. పాల్వంచ ఎఫ్డిఓ తిరుమల రావు, ఎఫ్ఆర్వో టాస్క్ఫోర్స్ ప్రసాద్, ములకలపల్లి ఎఫ్ఆర్వో రవికిరణ్, ఎఫ్ఆర్వో సిహెచ్ శ్రీనివాస్, చేతకొండ ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్ స్పైక్ ఫోర్స్ పాల్గొన్నారు.
144 సెక్షన్ అమలు
బుడ్డగూడెం గ్రామంలో అటవీశాఖ అధికారులకు, పోడు రైతులకు మధ్య రగులుతున్న వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసే అవకాశాలు ఉండటంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు సోంపల్లి పంచాయతీ బీట్ పరిధిలో ఈనెల 20వ తేదీ వరకు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని బూర్గంపాడు తహసీల్దార్ భగవాన్ రెడ్డి విలేకరులకు తెలిపారు.
భూములు లాక్కుంటే ప్రతిఘటన : సీపీఐ(ఎం)
పోడు భూముల సర్వేను పూర్తిచేసి తక్షణమే రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు.
ములకలపల్లి మండలం మాధారంలో పోడు భూములను సందర్శించి పోడుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సాగులో ఉన్న పోడు భూములన్నింటినీ సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చినా స్థానిక అటవీశాఖ అధికారులు మాత్రం కుంటిసాకులు చెబుతూ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. సాగుదారుల భూముల్లో అటవీ అధికారులు ఆక్రమంగా మొక్కలు నాటారని, పేదల నుంచి భూములు గుంజుకోవాలని చూస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.