Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయవిద్యలోనూ ఉద్యోగావకాశాలు
- నల్సార్ వీసీ శ్రీకృష్ణదేవరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2023 రాతపరీక్షను డిసెంబర్ 18న నిర్వహిస్తామని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ శ్రీకృష్ణదేవరావు చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో క్లాట్ పరీక్షకు సంబంధించిన బ్రోచర్లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1,150 లా కాలేజీలున్నాయని చెప్పారు. వాటిలో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం రెండో ఉన్నతమైన వర్సిటీగా గుర్తింపు పొందిందని వివరించారు. దేశంలోని 22 న్యాయ విశ్వవిద్యాలయాలు కలిసి క్లాట్ పరీక్షను నిర్వహిస్తున్నాయని అన్నారు. ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులన్నారు. దేశవ్యాప్తంగా మూడు వేల సీట్లున్నాయనీ, అందులో నల్సార్ వర్సిటీలో 140 సీట్లున్నాయని వివరించారు. ఇందులో తెలంగాణ కోటా కింద 25 శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పారు. క్లాట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 13 వరకు గడువుందన్నారు. 150 మార్కులతో ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నాపత్రం ఉంటుందనీ, నెగెటివ్ మార్కులూ ఉంటాయని అన్నారు. న్యాయ శాస్త్ర విద్యార్థులకు సైతం ఉద్యోగావకాశాలున్నాయని చెప్పారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాల నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో కార్పొరేట్ రంగంలో అనేక అవకాశాలున్నాయని వివరించారు. ఇంజినీరింగ్, డాక్టర్ వంటి వృత్తి మాత్రమే కాకుండా న్యాయశాస్త్రంలోనూ ఉద్యోగావకాశాలను దృష్టిలో ఉంచుకుని ఇంటర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ వి బాలకిష్టారెడ్డి పాల్గొన్నారు.