Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
- మిడ్ డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి హిమిదేవి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మధ్యాహ్న భోజన కార్మికులకు పది నెలలకే కాదు 12 నెలలకు వేతనాలివ్వాలని 2019 సెప్టెంబర్ 30న కోర్టు తీర్పునిచ్చిందనీ, దాన్నీ పాలకులు అమలు చేయడం లేదని మిడ్ డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి హిమిదేవి తెలిపారు. ఆ ఫెడరేషన్ జాతీయ రెండో మహాసభల నిమిత్తం హైదరాబాద్ విచ్చేసిన ఆమె నవతెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు. పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే..'హిమాచల్ ప్రదేశ్‌లో సీఐటీయూ చేపట్టిన అనేక పోరాటాల ఫలితంగా మధ్యాహ్నభోజన కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.3,500కి పెంచుకోగలిగాం. అయితే, 2018 నుంచి ఒక్క రూపాయి కూడా పెంచలేదు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఆ గౌరవ వేతనంతో కార్మికులు ఎలా బతుకుతారు? లక్షలాది మంది చిన్నారులకు వంట చేసి వారి కడుపులు నింపే సేవా కార్యక్రమం చేస్తున్న కార్మికుల పట్ల పాలకులు అవలంబించే తీరు ఇదేనా? హిమాచల్ ప్రదేశ్‌లో మిగతా ప్రాంతాల కంటే భిన్నమైన పరిస్థిలుంటాయి. ఎత్తయిన కొండలు, లోయల ప్రాంతాలకు సరైన రవాణా సౌకర్యాలుండవు. పిల్లలకు వంట సరుకులు అక్కడకు చేర్చడమూ పెద్ద కష్టంతో కూడుకున్న పని. అలాంటి సమయంలో పిల్లలకు అక్కడ వండిపెట్టడమే సముచితం. కమ్యూనిటీ కిచెన్ల పేరుతో పథకం నిర్వహణను ఎన్జీఓ, కార్పోరేట్ సంస్థలకు అప్పగించాలనే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టడంలో ఇప్పటికైతే విజయవంతం అయ్యాం. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూడాలి. మధ్యాహ్న భోజన కార్మికుల్లో ఎక్కువ మహిళలే. వారికి కనీసం ప్రసూతి సెలవులు కూడా ఇవ్వడం లేదు. దీనిపై పథకం నిర్వహణను చూసే డైరెక్టర్‌తో మాట్లాడాం. సెలవులు ఇచ్చే ప్రతిపాదను సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పారు. కానీ, ఆచరణలోకి తీసుకొచ్చేదాకా పోరాటం చేస్తాం.కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతం కాబట్టి ప్రతి పాఠశాలలోనూ ఇద్దరు వర్కర్లు ఉండాలని శాంతకుమార్ సీఎంగా ఉన్న సమయంలో ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం దాన్ని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కింది. దీనిపైనా కార్మికులను ఐక్యం చేస్తున్నాం. వారికి న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం నికరంగా పోరాడుతాం' అని చెప్పారు.