Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా పోరాటాలతో టీఎంసీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది
- మిడ్ డే మీల్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు కృష్ణరాయ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మధ్యాహ్న భోజనం పథకం వంట బాధ్యతను ఎన్జీఓలకు అప్పగించకుండా బలంగా పోరాడుతున్నామనీ, దీంతో బెంగాల్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని మిడ్ డే మీల్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు కృష్ణరాయ్ తెలిపారు. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన మిడ్ డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ రెండో మహాసభల సందర్భంగా ఆమె నవతెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు. 'మధ్యాహ్న భోజన కార్మికులపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడులు తీవ్రంగా ఉన్నాయి. వర్కర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి పనిచేస్తున్న కార్మికులను తొలగించి టీఎంసీ కార్యకర్తలను నియమిస్తున్న పరిస్థితి ఉంది. వంట మాత్రమే చేయాల్సిన కార్మికులతో నిబంధనలకు విరుద్ధంగా పనిచేయిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. క్లాసు రూమ్‌లతో పాటు బాత్రూమ్లను కూడా క్లీన్ చేయిస్తున్నారు. ఇది వారి విధికాదు. పని ప్రదేశాల్లో కనీస భద్రత కూడా లేదు.వీటిపై బ్లాకులు, జిల్లాలు, రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేశాం. సమస్యలపై కార్మికుల పక్షాన పోరాడుతూ వారికి అండగా ఉంటున్నాం. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలపై ఆగస్టు 23,24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు పోరాటం చేశాం. అది విజయవంతమైంది. వంట బాధ్యతను ఎన్జీఓలకు అప్పగిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా బలంగా పోరాడుతున్నాం. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రాష్ట్రంలో కేవలం రూ.1500 గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారు. గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజంతా పనిచేసినా ఇచ్చే అతి తక్కువ గౌరవ వేతనంతో కుటుంబాలు గడవని పరిస్థితి ఉంది. వర్కర్లకు బోనస్ ఇవ్వట్లేదు. యూనిఫారమ్ ఇవ్వట్లేదు. పీఎఫ్, ఐడెంటీ కార్డులు, పీఎఫ్ అస్సలే ఇవ్వట్లేదు. వంట చేసే ప్రాంతాల్లో కనీస రక్షణ చర్యలు లేవు. క్షేత్రస్థాయిలో వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటాల్లోకి వస్తున్నారు. మిడ్ డే మీల్స్ వర్కర్స్ యూనియన్‌గా కార్మికుల సమస్యల మీద కొట్లాడుతున్నాం. గౌరవ వేతనాన్ని 26 వేలకు పెంచాలనే డిమాండ్‌తో కొట్లాడుతున్నాం. పది నెలలకు కాకుండా 12 నెలలకు గౌరవ వేతనం చెల్లించాలనే డిమాండ్‌తో ముందుకు సాగుతున్నాం. మా సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ పోరాటాలను ఉధృతం చేస్తాం' అని చెప్పారు.