Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడిగా ప్రజల రవాణా అవసరాలు తీర్చాలని నిర్ణయం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రజలకు మరింత మెరుగైన ప్రజారవాణాను అందించేందుకు కలిసి పనిచేయాలని టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రోరైల్ సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు శనివారంనాడిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ మేనేజింగ్డైరెక్టర్ వీసీ సజ్జనార్, ఎల్ అండ్ టీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ మురళీ వరదరాజన్ దీనికి సంబంధించిన పరస్పర ఒప్పందం (ఎమ్ఓయూ)పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజారవాణాలో ఇదో కొత్త అధ్యాయమని అభిప్రాయపడ్డారు. మెట్రో స్టేషన్ల అనుసంధానంగా బస్సులను నడపడంతో పాటు సర్వీసుల సమయపట్టిక, సూచిక బోర్డులు, సమాచార కేంద్రాలు, అనౌన్స్ మెంట్ చేసే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెట్రో రైలు దిగగానే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా సర్వీసులను నడిపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వాహనాల రద్దీ, ట్రాఫిక్ జాంల వంటి ఆటంకాలను నివారించడానికి ప్రజలు ప్రజా రవాణా సేవల్ని వినియోగించు కోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎల్ అండ్ టీ మెట్రోరైల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రిషికుమార్వర్మ తదితరులు పాల్గొన్నారు.