Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేద పిల్లలకు సమయానికి ఆహారాన్ని అందిస్తున్నది వారే..
- ఖైదీలకిచ్చే వేతనం కంటే తక్కువ ఇస్తున్నారు
- హక్కుల కోసం పోరాడుతాం : సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఏ.ఆర్.సింధు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వచ్చే నెల 11న దేశవ్యాప్తంగా డిమాండ్ డే నిర్వహించనున్నట్టు సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఏ.ఆర్. సింధు ప్రకటించారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత మిడ్డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ అనుబంధం) రెండో మహాసభల సందర్భంగా శనివారంనాడు ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు ఎస్.వరలక్ష్మి, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమతో కలిసి ఆమె మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికులకు అతి తక్కువ గౌరవ వేతనాలు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ అలవెన్స్ జైలులో శిక్ష అనుభవించే ఖైదీలకిచ్చే దానికంటే తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పథకాన్ని సక్రమంగా అమలు చేయడానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించట్లేదని విమర్శించారు. దీనివల్ల పిల్లలు పౌష్టికాహారలేమితో బాధపడుతున్నారని తెలిపారు. గ్లోబల్ హంగరీ ఇండెక్స్ ఇదే విషయాన్ని ఎత్తిచూపిందని తెలిపారు. అయితే, ఆ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రామాణికం కాదంటూ ప్రధాని మాట్లాడటం సరిగాదన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు, ఆ పథకానికి నిధులు పెంచాలని పలు పార్లమెంటరీ కమిటీలు సిఫారసు చేసినా పాలకులు పట్టించుకోవట్లేదన్నారు. కార్మికులకు చాలా రాష్ట్రాల్లో రూ.1000 వేతనం మాత్రమే ఇస్తున్నారనీ, అదీ 10 నెలలకు మాత్రమే చెల్లిస్తున్నారని చెప్పారు. పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా వేతనం లేకపోవడంతో వారి జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నా భోజన కార్మికులకు 12 నెలలకు జీతాలు ఇవ్వాలని చత్తీస్గఢ్ హైకోర్టు ఆర్డర్ జారీ చేసినా అమలు చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పథకాన్ని కార్పోరేట్లకు కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదని విమర్శించారు. దానికనుగుణంగా ఇస్కాన్, అక్షయపాత్ర వంటి కార్పోరేట్లు కేంద్రీకత వంటగదులను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహిస్తున్న తీరును వివరించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గుడ్డు, ఉల్లిపాయలు ఆహారంలో చేర్చరాదంటూ ఆంక్షలు విధిస్తున్నారని తెలిపారు. దానివల్ల వల్ల బడీడు వయస్సు పిల్లలకు అవసరమైన పోష్టికాహారం అందట్లేదని వాపోయారు. కరోనా సమయాన్ని ఆసరాగ తీసుకోని మోడీ ప్రభుత్వం మధ్యాహ్నా భోజన బడ్జెట్లో తీవ్రమైన కోత విధించిన తీరును వివరించారు. ఆహారం, ఆరోగ్యం, విద్య, మొదలైన ప్రాథమిక హక్కులు తీర్చే పథకాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ పోరాటాలను ఉధృతం చేయబోతున్నట్టు ప్రకటించారు. 2023 జనవరి 6ను స్కీం వర్కర్ల ఉమ్మడి అఖిల భారత నిరసన దినంగా పాటించాలని ఆమె పిలుపునిచ్చారు. అఖిల భారత మిడ్డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు ఎస్.వరలక్ష్మీ మాట్లాడుతూ.. మధ్యాహ్నా భోజన పథకం కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నాయనీ, వారిని కనీసం కార్మికులుగా గుర్తించట్లేదని విమర్శించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వివిధ సేవలు, వస్తువల మీద పన్నులు భారీగా వేయడం వల్ల వారికి విధులు నిర్వహించడంలోనూ, వారి వ్యక్తిగత జీవితంలో కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీని వల్ల కార్మికులు మరింత పేదరికంలో నెట్టబడుతున్నారని వాపోయారు. ఎన్జీఓలకు పథకం నిర్వహణనను అప్పగించడం వల్ల నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బియ్యం, పప్పులు, గ్యాస్ తదితర అన్ని సౌకర్యాలకు అవరమైన ఖర్చులను ప్రభుత్వమే చెల్లించాక నిర్వహణ ఎన్జీఓలకు ఎందుకు అప్పగించాలంటూ ప్రశ్నించారు. సమీకృత కిచెన్లలో వంట చేసి పాఠశాలలకు తరలించే క్రమంలో ఆహారం పాడైపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. పాఠశాలల్లో వండితేనే పిల్లలకు వేడివేడి భోజనం అందించవచ్చునని చెప్పారు. మధ్యాహ్నా భోజన పథకాన్ని పేదలు, కార్మికుల నుంచి లాగేసుకోవటం ద్వారా కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రని తిప్పికొట్టేందుకు కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.