Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెరువులో ఐదుగురు మదర్సా విద్యార్థులు, ఉపాధ్యాయుడు మృతి
- జవహర్‌నగర్‌లోని మల్కారం ఎర్రగుంట చెరువులో ఘటన
నవతెలంగాణ - జవహర్ నగర్
ఉన్నత చదువులు చదువుకొని.. మంచి భవిష్యత్తును ఎంచుకొని సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని ఎన్నో కలలుగన్న ఆ విద్యార్థుల జీవితం అర్ధాంతరంగా ముగిసింది.. ఈత కొట్టేందుకు చెరువులో దిగిన ఐదుగురు విద్యార్థులు, వారిని కాపాడబోయిన ఉపాధ్యాయుడు ప్రాణం కోల్పోయారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలోని మల్కారం ఎర్రగుంట చెరువులో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని మల్కారానికి చెందిన రెహ్మాన్ నూతన గృహ ప్రవేశం కోసం అంబర్‌పేటలోని హనీషా మదర్సా విద్యార్థులను పిలిచారు. దాంతో శనివారం ఉపాధ్యాయులు సహా 40మంది విద్యార్థులు మల్కారం వచ్చారు. పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ కొద్దిసేపు విద్యార్థులు సంతోసంగా గడిపారు. ఆ తర్వాత పక్కనే ఎర్రగుంట చెరువులో ఈతకొట్టేందుకని వెళ్లారు. ఐదుగురు విద్యార్థులు ఇస్మాయిల్(11), జాఫర్(10), సోహెల్(9), అయాన్(9), రియాన్(12) చెరువులోకి దిగారు. అయితే, వారికి లోతు తెలియక లోపలికెళ్లడంతో నీటిలో మునిగిపోయారు.
అది గమనించి ఉపాధ్యాయుడు యోహన్(25) వారిని కాపాడే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. దాంతో ఆరుగురూ మునిగిపోయి ప్రాణం కోల్పోయారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ ఏసీపీ సాధన రష్మి పెరుమల్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్, ఎస్ఐలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.అప్పటి వరకు అంతా కలిసి సంతోషంగా గడిపిన తమ తోటి స్నేహితులు విగతజీవులుగా మారడంతో విద్యార్థులు దు:ఖసాగరంలో మునిగిపోయారు. భయాందోళనతో ఉన్న విద్యార్థులకు స్థానికులు ఆకలి తీర్చారు.