Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్ పాదయాత్ర తెలంగాణ పార్టీకి దిశానిర్దేశం : జైరాం రమేష్
- జోగిపేటలో ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
- చౌటకూర్ నుంచి దానంపల్లి వరకు పాదయాత్ర
నవతెలంగాణ-జోగిపేట
రాహుల్ గాంధీ భారత్‌జోడో యాత్రకు సంగారెడ్డి జిల్లాలో అడుగడుగునా జననీరాజనంతోపాటు కాంగ్రెస్‌లో కొత్త జోష్ వచ్చింది. శనివారం అందోల్ నియోజకవర్గంలోని చౌటకూర్ వద్ద ప్రారంభమైంది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహా రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన పాదయాత్ర జోగిపేట పట్టణ కేంద్రం మీదుగా దానంపల్లికి చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అల్మాయిపేట్, సంగుపేట్, అందోల్, జోగిపేట, అన్నసాగర్, దానంపల్లి వద్ద కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలికారు. పాదయాత్రలో రాహుల్ వెంట రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, భట్టి విక్రమార్క, జైరాం రమేష్, మల్లు రవి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, మధుయాష్కీ తదితరులు నడిచారు. దానంపల్లి మీదుగా సాయంత్రం గడి పెద్దాపూర్ వరకు చేరుకుంది.
రెండూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలే..
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్
పరిపాలన విషయంలో కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్‌కు ఎలాంటి తేడా లేదని.. రెండూ ఒకే పట్టాలపై వెల్లే డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో భాగంగా అందోల్ మండలం దానంపల్లి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వస్తోందని, ఇది కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్‌ను తీసుకొచ్చిందని చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణలోని ఏడు జిల్లాల్లో పాదయాత్ర పూర్తైందన్నారు. ఉన్నతమైన లక్ష్యం కోసం రాహుల్ గాంధీ యాత్ర మొదలు పెట్టారన్నారు. రాహుల్ పాదయాత్ర తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త దిశా నిర్దేశం చేస్తుందని తెలిపారు. పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ అన్ని వర్గాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికే వందలాది మంది విద్యార్థులు, కార్మికులు, సామాజికవేత్తలను కలిశారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ పాదయాత్ర ద్వారా తమకు తెలిసిందన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకు భారత్ జోడో యాత్రకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిందని, ఇది అత్యంత కఠిన నిర్ణయమని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఎలాంటి ఆపరేషన్లు నిర్వహించారో అందరికీ తెలుసన్నారు.
జోడో యాత్రలో అపశృతి
జోగిపేటలోని హౌసింగ్ బోర్డ్ వద్ద రాహుల్ కాన్వారు, డివైడర్‌కు మధ్యలో కానిస్టేబుల్ శివకుమార్ కాలు ఇరుక్కుని విరిగింది. పాపన్నపేట పోలీస్ స్టేషన్లో బత్తిని శివకుమార్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తు న్నారు. ఆయన్ను చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.