Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడులో డబ్బులు పంచలేదంటూ ప్రమాణం చేయాలి
- బండి సంజయ్‌కి కూనంనేని సవాల్
- అవినీతికి కేంద్రబిందువు ప్రధాని మోడీ
- తెలంగాణ పోలీసులు మోడీ,షాపై కేసు పెట్టాలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుందన్న బండి సంజయ్ ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే రాజకీయ అస్త్ర సన్యాసం లేదేంటే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా?అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సవాల్ విసిరారు. సీపీఐ, సీపీఐ(ఎం) మద్దతుతో టీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు బీజేపీకి చెంపపెట్టులాంటిదని అన్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సంజయ్‌కి క్షమాపణ చెప్తాననీ, ఆయనకు దండ వేస్తానని అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీని ఎక్కడైనా ఓడించేందుకు చివరి వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఆ పార్టీని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా కలుస్తామన్నారు. దేశానికే ప్రమాదకరమైన కాషాయ పార్టీని రాష్ట్రంలో ఎదగనివ్వబోమన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ డబ్బులు పంచలేదంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రమాణం చేస్తారా?అని ప్రశ్నించారు. అప్పుడే ఆయన చేసే ప్రమాణాలకు విలువ ఉన్నట్టు గుర్తిస్తామన్నారు. అవినీతికి కేంద్రబిందువు ప్రధాని మోడీ అని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ పోలీసులకు ధైర్యముంటే ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వరవరరావు, సాయిబాబాపైన కుట్ర కేసులు పెట్టినట్టే, రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్ర చేసిన వారిపైనా కేసులు పెట్టాలని కోరారు. బండి సంజయ్, తరుణ్ చుగ్ దెయ్యం పట్టినట్టు దేవుడి మీద ప్రమాణం చేసి ఇతరులు కూడా అదే చేయాలంటున్నారని చెప్పారు సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్,న్యాయవ్యవస్థతోపాటు రాజ్యాంగ వ్యవస్థలన్నీ మోడీ ఆధీనంలో పనిచేస్తున్నపుడు ఇక ఎన్నికలను నిర్వహించడమెందుకని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నామా? లేక నిరంకుశ వ్యవస్థలో ఉన్నామా?, ఈ దేశాన్ని కార్పొరేట్ శక్తులు పాలిస్తున్నాయా?అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. రాజనీతిజ్ఞుడుగా ఉండాల్సిన ప్రధాని మోడీ ఒక జిల్లా, గ్రామ స్థాయి నాయకునిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన దిగజారి, దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి చౌకీదార్‌గా ఉంటానన్న మోడీ స్వార్థం, అధికారం కోసం, దేశాన్ని అన్ని రంగాల్లో అపఖ్యాతి పాలు చేస్తున్నారని అన్నారు. బండి సంజయ్ మొండి సంజయ్గా మారి పీఠాధిపతులు మాట్లాడిన స్క్రిప్ట్ కేసీఆర్ ఇచ్చారంటూ బుర్ర లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
పెరుగుతున్న వామపక్షాల ప్రాధాన్యత : అజీజ్ పాషా
ప్రపంచ వ్యాప్తంగా లాటిన్ అమెరికా, డెన్మార్క్ లాంటి దేశాల్లో వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడడం మంచి పరిణామమని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా అన్నారు. వామపక్షాల పని అయిపోయిందంటూ చాలామంది దుష్ప్రచారం చేశారనీ, కానీ ప్రస్తుతం వాటి ప్రాధాన్యత రోజు రోజుకూ పెరుగుతున్నదని చెప్పారు. ఇటీవల బ్రెజిల్లో లులా డిసిల్వా, డెన్మార్క్ సెంట్రల్ అభ్యర్థి గెలుపే అందుకు నిదర్శనమన్నారు. భారత్‌లో మీడియాపైన ఆంక్షలు, ఒత్తిడి తీవ్రంగా ప పెరుగుతోందని విమర్శించారు. స్వతంత్రంగా పని చేసే మీడియా సంస్థలపై పాలకులు ఆంక్షలను విధిస్తున్నారని అన్నారు. మీడియా స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించాలని కోరారు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ బలహీన పునాదులపైన ఉన్నాయనీ, ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ప్రధాన పాత్ర పోషించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దొంగలెవరో, దొరలెవరో తేలాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు పశ్యపద్మ, ఈటి నరసింహా తదితరులు పాల్గొన్నారు.