Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాసంగిలో యేటా 85శాతాన్ని మించుతున్న వరి సాగు
- మిగతా పంటలన్నీ సాగవుతోంది 15శాతంలోపే..
- మొక్కజొన్న పర్వాలేదనిపించినా.. పప్పులు, కూరగాయల సాగు కనుమరుగు
- జిల్లాకు పదివేల ఎకరాల్లో సాగైన పల్లి ప్రస్తుతం 1500లోపు ఎకరాల్లోనే..
- ఉమ్మడి జిల్లాలో వంద ఎకరాలూ దాటని కంది సాగు
- వెయ్యి ఎకరాలు దాటని శనగ, పెసర పంటలు
- ఆకాశాన్నంటుతున్న నిత్యవసర దినుసులు, కాయగూరల ధరలు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
పెసలు, కందులు, శనగలు, జొన్నలు, రాగులు, అనుములు, మినుములు, రాగులు.. ఒకప్పుడు యాసంగిలో విరివిరిగా సాగైన పంట చేలు.. ఇప్పుడు కనుమరగయ్యాయి. కనీసం పల్లి చేనూ అక్కడక్కడా అవశేషాలుగానే కనిపిస్తోంది. అందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించకపోవడం ఒక కారణమైతే.. పెరిగిన నీటివనరులతో రైతాంగమంతా వరివైపే మొగ్గుచూపడం మరో కారణం. యాసంగిలో పప్పుదినుసులు వేసుకునే రైతులు మొత్తం సాగు విస్తీర్ణంలో 85శాతానికిపైగా వరి మాత్రమే వేస్తున్నారు. పర్యవసానంగా నిత్యావసర పప్పుదినుసులు, కూరగాయల ధరలు మార్కెట్లో అగ్గిదూకుతున్నాయి. ఏ పప్పు కొందామన్నా.. ప్రస్తుతం కిలో రూ.120కిపైగా వెచ్చిస్తేగానీ దొరకని పరిస్థితి నెలకొంది. ఇక కాయగూరలు స్థానికంగా కనీస సాగు కనుమరుగవడంతో దిగుమతి చేసుకోవాల్సి రావడంతో కిలో రూ.50కిపైగానే ఉంటున్నాయి.
యాసంగిలో 2012 వరకూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3లక్షల ఎకరాలు కూడా వరి సాగు విస్తీర్ణం లేదు. అదీ ఏకంగా ఏయేటికాయేడు పెరుగుతూ సుమారు 10లక్షల ఎకరాలకు చేరింది.
వానాకాలంలోనైతే ఏకంగా 12లక్షల ఎకరాల్లో సాగవుతోంది. పదేండ్ల కిందట వరకూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పత్తి ప్రధాన పంటగా ఉండేది. అందులో అంతరపంటగా కందులు సాగు చేసేవారు. ఇప్పుడు వరి 85శాతానికిపైగా విస్తీర్ణంలో సాగువు తుండగా.. పత్తి కేవలం 10శాతానికే పరిమితమైంది. మిగిలిన 5శాతం విస్తీర్ణంలోనే మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పల్లి సాగవుతోంది. ఒకప్పుడు పత్తి అంతరపంటగా సాగైన కంది కనీసంగా 15వేల ఎకరాల్లో ఉంటే ఇప్పుడు వంద ఎకరాలూ దాటని పరిస్థితి నెలకొంది. ఇక శనగ, పెసర పంటలు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనీసం వెయ్యి ఎకరాలు దాటలేదు. ఇక కూరగాయల పరిస్థితి చెప్పనక్కర్లేదు.. 2016 వరకూ కాయగూరల సాగు విస్తీర్ణం 15వేల ఎకరాల్లో ఉంటే 2017 నుంచి తగ్గుముఖం పడుతూ వచ్చింది. ఏకంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనీసం 4వేల ఎకరాలు కూడా దాటడం లేదు. ఈ వానాకాలంలో 3వేల ఎకరాలకే పరిమితం అయింది.
ప్రభుత్వ ప్రోత్సాహం కనుమరుగు...
గతంలో బిందు, తుంపర సేద్యానికి ప్రోత్సా హకం ఉన్న సమయంలో పప్పుదినుసులు, పల్లి, కూరగాయలు విరివిరిగా సాగయ్యేవి. ఇటు వ్యవసాయం, అటు ఉద్యాన శాఖలు కాయగూరల విత్తనాలకు రాయితీలూ అందిస్తూ ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేవి. ఇప్పుడు కాళేశ్వరం జలాలు అందుబాటులోకి రావడం.. ప్రతియేడూ సమృద్ధిగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారడం, చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉండటం.. భూగర్భజలాలూ పెరగడం కారణంగా వరి సాగు ఏకంగా 12లక్షల ఎకరాలకు విస్తరించింది. వానాకాలం, యాసంగి సీజన్లలో మొత్తం సాగు విస్తీర్ణంలో 90శాతం వరకూ వరి మాత్రమే వేయడంతో ప్రత్యామ్నాయ పంటలు కనుమరగయ్యాయి. ఫలితంగా నిత్యావసరంగా వాడుకునే పప్పుదినుసులు, కాయగూరల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.