Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10,309 ఓట్ల మెజార్టీతో ప్రభాకర్‌రెడ్డి గెలుపు
- చివరి రౌండ్ వరకు ఉత్కంఠ...
- కమలంకు కలిసి రాని చౌటుప్పుల్, చండూర్
- గెలుపులో వామపక్షాలే కీలకం
నవతెలంగాణ -మిర్యాలగూడ
దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న మునుగోడు ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. హోరాహోరీగా పోరు సాగి చివరికి టీఆర్ఎస్ పార్టీ గెలుపు కైవసం చేసుకుంది. నల్లగొండలోని ఆర్జీల బావి వద్ద ఎఫ్‌సీఐ గోదాంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 47 మంది పోటీలో ఉన్న ఈ ఎన్నికలో తొలుత 684 పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. ఇందులో టీఆర్ఎస్కు 194 ఓట్ల మెజార్టీ వచ్చింది. మొదటి రౌండ్లో చౌటుప్పల్ మండలం ఓట్లను లెక్కించగా.. టీఆర్ఎస్కు 1292 ఓట్ల మెజార్టీ వచ్చింది. రెండు, మూడు రౌండ్లలో బీజేపీకి మెజార్టీ రాగా, నాలుగో రౌండ్ నుంచి మొదలుకొని చివరి రౌండ్ వరకు టీిఆర్‌ఎస్ ఆధిక్యత చూపిస్తూ వచ్చింది. ప్రతి రౌండ్లోనూ స్వల్ప ఓట్ల తేడా మెజార్టీ వస్తుండటంతో ఫలితాలు ఉత్కంఠంగా సాగాయి. 10,309 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. కాగా, టీఆర్ఎస్ అభ్యర్థికి 97,006 ఓట్లు, బీజేపీకి 86,697, కాంగ్రెస్‌కు 23,906 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తమ గుర్తింపు నిలుపుకుంది కానీ డిపాజిట్‌ను కోల్పోయింది. నాలుగో స్థానంలో బహుజన సమాజ్ పార్టీ నిలిచింది ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థులు రోలర్ గుర్తు అభ్యర్థి, చపాతీ రోలర్ అభ్యర్థి నిలిచారు. మిగిలిన అభ్యర్థులకు రెండు అంకెల లోపే ఓట్లు పడ్డాయి.
బీజేపీని నిరాశపర్చిన చౌటుప్పల్, చండూర్ మండలాలు
బీజేపీకి అనుకూలంగా ఉన్న చౌటుప్పల్, చండూరు మండలాల్లో టీఆర్ఎస్ అధిక్యత చూపించడంతో బీజేపీ శ్రేణుల్లో నిరాశ మిగిల్చింది. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మండలంలో సుమారు 5000 పైచిలుకు ఓట్లు ఆధిక్యత వస్తుందని భావించారు. అదేవిధంగా చండూరు పట్టణంలో మెజార్టీ వస్తుందని ఆశించారు. ఈ రెండు మండలాల్లో మెజార్టీ వస్తే మిగిలిన మండలాల్లో మెజార్టీ రాకపోయినా 1500 నుంచి 2000 ఓట్ల మెజార్టీతో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ అగ్రనేతలు భావించారు. అదే దీమాతో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. తొలుత చౌటుప్పల్ మండలం ఓట్లు లెక్కించగా పెద్దగా మెజార్టీ రాకపోవడంతో గెలుపుపై ఆశలు వదులుకున్నారు. ఇదే విషయాన్ని రాజగోపాల్ రెడ్డి కౌంటింగ్ హాల్ వద్ద మీడియా ముందు ప్రస్తావించారు. చండూర్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. చివరి రౌండ్ 15లో బీజేపీ అభ్యర్థి 88 ఓట్లు సాధించాడు. టీఆర్ఎస్ పార్టీ అన్ని రౌండ్లలోనూ మెజార్టీ చూపించింది.
కమ్యూనిస్టులే కీలకం
మునుగోడు నియోజవర్గంలో బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉన్న కమ్యూనిస్టులు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. నోటిఫికేషన్ నుంచి పోలింగ్ అయిపోయేంతవరకు కమ్యూనిస్టు క్యాడర్ టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం విశేష కృషి చేశారు. నిరంతరం శ్రమించి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థికి వేయించడంలో సఫలీకృతమయ్యారు. ఒక దశలో టీఆర్ఎస్ క్యాడర్ కంటే కమ్యూనిస్టు క్యాడరే బలంగా పనిచేసినట్టు ప్రచారం నడిచింది. చివరికి కమ్యూనిస్టులు మద్దతుతోనే టీఆర్ఎస్ గెలుపొందింది. కమ్యూనిస్టుల మద్దతు లేకపోతే టీఆర్ఎస్కు డిపాజిట్ కూడా వచ్చేది కాదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రస్తావించడం విశేషం.