Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజగోపాల్‌రెడ్డీ..దిగజారుడు మాటలు మానుకో
- మునుగోడు ప్రజలకు అభినందనలు: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెంపపెట్టుటాంటిదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. అక్కడ గెలుపు కోసం పడరాని పాట్లు పడిందని చెప్పారు. కమ్యూనిస్టులు బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించిన ప్రజలకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్పారు. కష్టపడి పనిచేసిన సీపీఐ(ఎం), సీపీఐ, టీఆర్ఎస్ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మునుగోడులో గెలిచి, వచ్చే సాధారణ ఎన్నికల్లో తామే ప్రధాన ప్రత్యర్థిమనే సంకేతాన్ని పంపాలనే బీజేపీ ఎత్తుగడను అక్కడి ప్రజలు తిప్పికొట్టారన్నారు. అక్రమ మార్గంలో గెలిచేందుకు ఎన్నో ఎత్తులు వేసిందని విమర్శించారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను బీజేపీ అప్రజాస్వామికంగా అనేక రాష్ట్రాల్లో కూల్చేసిందనీ, తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం ద్వారా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని నిస్సిగ్గుగా ప్రయత్నించిందని చెప్పారు. ఆ కుట్ర బట్టబయలు కావటంతో... ఇలాంటి తప్పుడు పద్ధతులను సహించబోరంటూ ప్రజలు తమ ఓటు ద్వారా తమ తీర్పును చెప్పారన్నారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ.18వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుబోయి ఈ ఎన్నికలను తీసుకొచ్చారని ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు.
కాషాయ కుట్రలు సాగనివ్వం..
నైజాం సర్కారుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడిన ప్రాంతమిదన్నారు. వెట్టి, బానిసత్వం నుంచి ప్రజలను విముక్తి గావించేందుకు చైతన్యయుత ఉద్యమాలు సాగిన నేల అన్నారు. భవిష్యత్‌లోనూ కాషాయుల కుట్రలు సాగన్విబోమని నొక్కి చెప్పారు. రాబోయే కాలంలో పరిపాలనలో ఉన్న లోపాలను సవరించుకుని కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గర కావాల్సిన అవసరాన్ని ఈ ఫలితం సూచించిందన్నారు. ముఖ్యంగా పేదలు, గిరిజనుల పోడు భూములు, కార్మికుల, నిర్వాసిత రైతుల, మధ్యతరగతి వర్గాల, నిరుద్యోగ యువకుల సమస్యలను పరిష్కరించేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు.
రాజగోపాల్‌రెడ్డివి దిగజారుడు మాటలు..
ఓటమి బాధతో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి అనంతరం దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నానంటూనే ఎన్నికలు అక్రమంగా జరిగాయనీ, కమ్యూనిస్టులు అమ్ముడు పోయారని అవాకులు చెవాకులు పేలడం తగదని సూచించారు. తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవుపలికారు.