Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ విజయం మోడీ..షాకు చెంప పెట్టులాంటిది
- తమ్మినేని, కూనంనేని సహా ఇతర నేతలకు కృతజ్ఞతలు
- కామ్రేడ్స్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు : ముడుగోడు ఫలితంపై మంత్రి కేటీఆర్
- బీజేపీ నేతలు ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలంటూ హితవు
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో అక్కడి ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ విజయం ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు చెంప పెట్టులాంటిదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు బుద్ధి తెచ్చుకోవాలనీ, ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ఉప ఎన్నిక సందర్భంగా తమ తమ పార్టీ శ్రేణుల్ని కార్యోన్ముఖుల్ని చేయటం ద్వారా టీఆర్ఎస్ విజయంలో కీలక పాత్ర పోషించిన సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు ఈ సందర్భంగా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అద్భుతమైన నిర్మాణ దక్షత కలిగిన ఆయా పార్టీలు ప్రచారంలోనూ అంతే అద్భుతంగా పని చేశాయని అన్నారు. ఈ ప్రక్రియలో భాగస్వాములైన సీపీఐ (ఎం) నేతలు చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, సీపీఐ నేతలు పల్లా వెంకటరెడ్డి, ఉజ్జిణి యాదగిరిరావుతోపాటు చెమటోడ్చి పనిచేసిన కామ్రేడ్స్ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితం అనంతరం ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, వి.శ్రీనివాసగౌడ్ తదితరులతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండబోవనే నానుడికి ప్రస్తుత ఉప ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ, షా బలవతంగా తెచ్చిన, రుద్దిన ఈ ఎన్నికలో మునుగోడు ప్రజలు గుద్దిన గుద్దుడుకు బీజేపీకి దిమ్మ తిరిగిందని ఎద్దేవా చేశారు. ఈ మొత్తం ప్రహసనంలో రాజగోపాల్‌రెడ్డి కేవలం పైకి కనిపించే ఒక బొమ్మ మాత్రమే.. వెనుకుండి డ్రామా, నాటకం ఆడించింది మోడీ, షా అని విమర్శించారు. వారిద్దరూ కలిసి తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చారని తెలిపారు. తెలంగాణలో సైతం అలాంటి వికృత క్రీడకు తెర లేపేందుకు ప్రయత్నించారని గుర్తు చేశారు. మునుగోడుకు సంబంధించి ఢిల్లీ నుంచి డబ్బు సంచులు పంపారనీ, వందల కోట్లు గుమ్మరించారని చెప్పారు. బండి సంజరుకు సంబంధించిన చొప్పరి వేణు, ఈటల రాజేందర్ పీఏ కొడారి శ్రీను డబ్బుతో పట్టుబడింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. డాక్టర్ వివేక్...కింగ్ పిన్‌లా వ్యవహరిస్తూ ఈటలకు డబ్బులు పంపారనీ, జమున హెచరీస్ ఖాతాలోకి రూ.25 కోట్లను మళ్లించారని వివరించారు. మరోవైపు రాజగోపాల్‌రెడ్డికి చెందిన సుశీల్ ఇన్ఫ్రా కంపెనీ నుంచి రూ.5.24 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించారని చెప్పారు. ఇలాంటి ఆధారాలన్నింటితో తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అది కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమైందని అన్నారు. మరోవైపు 15 కంపెనీల సీఆర్పీఎఫ్ బృందాలను, 40 ఐటీ బృందాలను రంగంలోకి దించిన బీజేపీ... తమ పార్టీ నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసిందని తెలిపారు. తెలంగాణ వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా అనేక ఎన్నికలు వచ్చినా...ఏనాడు ఎన్నికలు డబ్బు మయం అయ్యాయనే ఆరోపణలు రాలేదని తెలిపారు. కానీ ఈటల, రాజగోపాల్‌రెడ్డి లాంటి బడా బడా వ్యాపార వేత్తలు రంగంలోకి దిగిన తర్వాతే ఇలాంటి విపరీత పరిణామలు చోటు చేసుకున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ ఎన్నికలో ఎన్నికల సంఘం వ్యవహారశైలి కూడా చాలా దారుణంగా ఉందంటూ కేటీఆర్ విమర్శించారు. రోడ్డు రోలర్ సహా తొలగించిన అనేక గుర్తులను తిరిగి బలవంతంగా లిస్టులో చేర్చారని చెప్పారు. కారును పోలిన అలాంటి గుర్తులకు దాదాపు ఆరు వేల ఓట్లు పడ్డాయని అన్నారు. దీంతోపాటు శిఖండి లాంటి రెండు పార్టీలను (బీఎస్పీ, కేఏ పాల్) కూడా బీజేపీ రంగంలోకి దించిందని చెప్పారు. సానుభూతి కోసం ఈటల డ్రామాలాడగా... బండి సంజరు అర్థరాత్రి హైడ్రామా నడిపారని విమర్శించారు. రాజగోపాల్‌రెడ్డికి దొంగ జ్వరం రాగా.. బీజేపీ నేతలు ఉద్యోగ సంఘాలను కూడా వదలకుండా ఆరోపణలు గుప్పించారనీ, కొందరికి డబ్బులిచ్చి అభ్యర్థులుగా రంగంలోకి దించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అనేక రకాలుగా ఫేక్ వార్తలు, జోకుడు చర్యలతో బీజేపీ నేతలు తమ పరువును తామే తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలన్నింటినీ ఛేదించిన మునుగోడు ప్రజలకు శిరస్సు వంచి మొక్కుతున్నానని అన్నారు. ఇదే సమయంలో బీజేపీ తమ విజయాన్ని అడ్డుకోలేకపోయింది.. కానీ కొంత మెజారిటీని తగ్గించగలిందని చెప్పారు. జీహెచ్ఎమ్సీ ఎన్నికల ప్రచారానికైతే మోడీ రావచ్చుగానీ... తమ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం మునుగోడుకు పోకూడదా..? అంటూ ఒక ప్రశ్నకు సమాధానంగా ఎదురు ప్రశ్నించారు. భవిష్యత్తులోనూ కమ్యూనిస్టులతో కలిసే పని చేస్తారా..? అని అడగ్గా... ఆ అంశంపై తమ పార్టీ అధ్యక్షుడు (కేసీఆర్), సీపీఐ(ఎం), సీపీఐ కార్యదర్శులు మాట్లాడుకుంటారని జవాబిచ్చారు.