Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్ ప్రెస్‌మీట్ మినీ బహిరంగ సభలా మారిన వైనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి విజయం సాధించటంతో హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో సంబురాలు అంబరాన్నంటాయి. ఆదివారం ఉప ఎన్నిక ఫలితం వెలువడక ముందే టీఆర్ఎస్కు చెందిన నగర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బాణాసంచా పేలుస్తూ, మిఠాయిలు పంచుతూ పండగ చేసుకున్నారు. మరోవైపు డీజేలు, సౌండ్ బాక్సుల్లో పాటలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. బ్యాండ్ బాజాల మోతకు కార్యకర్తలు, నాయకులు లయబద్ధంగా నృత్యం చేస్తూ జోష్ నింపారు. 'జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, టీఆర్ఎస్ జిందాబాద్...' అనే నినాదాలతో తెలంగాణ భవన్ మార్మోగింది. మరోవైపు ఫలితం వెలువడిన తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన విలేకర్ల సమావేశం... మినీ బహిరంగ సభను తలపించింది. అప్పటిదాకా బాణా సంచా కాలుస్తూ, డ్యాన్స్‌లు వేస్తూ బయటున్న గులాబీ పార్టీ కార్యకర్తలు... ప్రెస్‌మీట్ మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుందనగా ఒక్కసారిగా మీడియా హాల్లోకి చొచ్చుకొచ్చారు. వారికి సర్దిజెప్పి బయటకు పంపేందుకు ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాదాపు 500 మంది ఇలా లోనికి రావటంతో ఎవరు మీడియా ప్రతినిధో, ఎవరు కార్యకర్తో అర్థం కాని పరిస్థితి. కేటీఆర్ లోనికి వచ్చిన తర్వాత ఆ గందరగోళం మరింత ఎక్కువైంది. కార్యకర్తల నినాదాలతో ఆయోమయ పరిస్థితి నెలకొంది. ఆయన ప్రెస్‌మీట్ ప్రారంభించిన తర్వాత కూడా ఇదే ప్రహసనం కొనసాగింది. విలేకర్ల సమావేశం ముగిసిన తర్వాత కూడా వారు అదే రకంగా వ్యవహరించటంతో ఒకటీ అరా ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చిన కేటీఆర్... అక్కడి నుంచి నిష్క్రమించారు. ఇలా కార్యకర్తల హడావుడి వల్ల మీడియా ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వారికి లోనికి రానివ్వకుండా అడ్డుకోవటంలో నిర్వాహకులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తాయి.