Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు పట్ల పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. మునుగోడు ప్రజలు బీజేపీ కేంద్ర నాయకత్వానికి కర్రుకాల్చి వాతపెట్టారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. మద్ధతిచ్చిన సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ జైత్రయాత్రకు మునుగోడు గెలుపు నాంది కానున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ వెంటే రాష్ట్ర ప్రజలున్నారని మునుగోడు ఫలితం నిరూపించిందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. బీజేపీపై బీఆర్ఎస్ సాధించిన తొలి విజయంగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలో తెలంగాణలో చెల్లవని మునుగోడు ప్రజలు గుణపాఠం చెప్పారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మోడీ దుర్మార్గాలను నిలువరించాలి అన్న వామపక్షాల అభిమతం మేరకు తీసుకున్న నిర్ణయంతోనే బీజేపీ పతనం ప్రారంభమైందని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే టీఆర్ఎస్తో కలిసి వామపక్షాలు పయనించాయని తెలిపారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ప్రగతిభవన్లో మిఠాయిలు
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మునుగోడు విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రగతిభవన్లో మిఠాయిలను పంచారు. మంత్రులు, ఇతర నాయకులకు మిఠాయిలు పంచి పరస్పరం శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకున్నారు.