Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గుండె మార్పిడి చేయించుకోవాల్సిన రోగులు, చేయించుకున్న రోగులు సాధారణ జీవితం గడపడమే కష్టమనే ఆలోచనల్లో ఉంటాం. కాని అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య చికిత్సల పుణ్యమానీ వారు పరుగులు తీస్తున్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో నిర్వహించిన మారథాన్లో రిసెప్షనిస్ట్ శ్రీధర్, గ్రాడ్యుయేట్ లోకిత్, జనరేటర్ టెక్నీషియన్ కాశీం, రైతు దుర్గయ్య, ప్రయివేటు ఉద్యోగి జితేందర్ పరుగులు తీసి ఔరా అనిపించారు. వీరందరు పల్మనరీ ఆర్టిరియల్ హైపర్ టెన్షన్ (పీఏహెచ్), డైలేటెడ్ కార్డియోమైయోపతీ (డీసీఎం) వ్యాధులున్నట్టు నిర్ధారించబడిన వారు. ఇలాంటి వారు ఇతరుల మాదిరిగా సాధారణ జీవితం గడిపేందుకే అనేక ఇబ్బందులుంటాయి. చాలా సందర్భాల్లో రోగుల్లో ఇలాంటి పరిస్థితికి కారణాలు తెలియవు.ఈ రోగులపై ఆయా కుటుంబాల సభ్యులు గుండెపై భారం వేయొద్దంటూ శారీరక శ్రమ నుంచి వారిని దూరంగా ఉంచాయి. అయితే మిగిలిన రోగులకు భిన్నంగా ఈ రోగులు అడ్వాన్స్డ్ కార్డియాక్ రిహాబ్ సేవలను పొందారు. దీంతో అపోహలు తొలగించుకుని 10 కిలోమీటర్ల పరుగులో పాల్గొన్నారు. వీరంతా రోగ నిర్ధారణ సమయంలో నేరుగా 100 మీటర్లు నడిచేందుకు భయపడ్డవారు కావడం గమనార్హం. వారి పరుగును చూసిన కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
కార్డియాక్ రిహాబ్తో వారి సామర్థ్యం పెరిగింది....డాక్టర్ మురళీధర్
పీఏహెచ్, డీసీఎం రోగులు కార్డియాక్ రిహాబ్ తర్వాత శరీరానికి ఆక్సిజన్ స్థాయి పెరిగిందనీ, కండరాల శక్తి బలపడిందని సనత్నగర్ ఈఎస్ఐసీ ఆస్పత్రి కార్డియాక్ రిహాబ్ స్పెషలిస్ట్ డాక్టర్ మురళీధర్ తెలిపారు. రిహాబ్ తర్వాత రోగుల్లో తమ ఆరోగ్యం పట్ల భయం పోయిందనీ, నెగెటివ్ ఆలోచనలు తొలగి సంతోషకరమైన జీవితం అనుభవిస్తున్నారని చెప్పారు.