Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుషారుగా సాగిన కాంగ్రెస్ భారత్ జోడోయాత్ర
నవతెలంగాణ-పెద్దశంకరంపేట
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర ఆదివారం ఉదయం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కోలపల్లి నుంచి ప్రారంభమైంది. కోలపల్లి వద్ద టీపీసీసీ ఉపాధ్యక్షులు సురేష్ శెట్కార్, టీపీసీసీ సభ్యులు పి.సంజీవరెడ్డి, శ్రీనివాస్ శంకర స్వామి, చెంద్రశేఖర్రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు నగేష్ శెట్కార్ రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికారు. పెద్దశంకరపేట మండలంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాదయాత్రలో హుషారుగా పాల్గొన్నారు. పేటలో ఐబీ వద్ద మహిళలతో రాహుల్ గాంధీ మాట్లాడి సమస్యలను ఓపిగ్గా విన్నారు. రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన సదర్ ఉత్సవాల్లో రాహుల్ గాంధీ ఉత్సాహంగా పాల్గొన్నారు. రాహుల్‌గాంధీని శాలువాతో ఘనంగా సన్మానించారు.
అనంతరం చిన్నపిల్లలతో పాదయాత్రలో పాల్గొన్నారు. పెద్దశంకరంపేటకు చెందిన కోయిలకొండ యాదగిరి మనవడు కార్తీకేయ బ్రెయిన్లో వాటర్ రావడంతో అతనికి చికిత్స నిమిత్తం రాహుల్ గాంధీ కార్పొరేట్ ఆస్పత్రికి రెఫర్ చేస్తామని హామీ ఇచ్చారు. చీలపల్లి క్రాస్ రోడ్ వద్ద రాహుల్ గాంధీ యువకులతో మాట్లాడారు. కమలాపూర్ వద్ద వెయ్యి మీటర్ల జాతీయ జెండాతో రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు.
రాహుల్ గాంధీ బీడీ కార్మికులు, సింగరేణి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. కాగా, రాహుల్ జోడోయాత్రకు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. ఏఐసీసీ నేతలు దిగ్విజరు సింగ్, జయరాం రమేష్, టీపీసీసీ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు సీతక్క, సంపత్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.