Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఆధిక్యాన్ని తగ్గించింది ఆ ఊర్లే
- టీఆర్ఎస్ గెలుపులో కీలకంగా కమ్యూనిస్టులు
నవతెలంగాణ - హైదరాబాద్‌బ్యూరో/చౌటుప్పల్ రూరల్
మునుగోడు ఉప ఎన్నికలో వామపక్షపార్టీల కార్యకర్తలు తమ శక్తికి మించి చేసిన కృషి ఫలించింది. రజాకార్లను ఎదురొడ్డిన మునుగోడు గడ్డ మీద మతోన్మాద శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే చైతన్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. వ్యక్తులు కాదు విధానాలే ముఖ్యం...మతతత్వ ఎజెండాకు చోటు లేదని మునుగోడు ప్రజానీకం నిరూపించింది. కమ్యూనిస్టుల కంచుకోటలో రాజగోపాల్‌రెడ్డి ఎన్ని నక్కజిత్తులు వేసినా పాచికలు పారలేదు. టీఆర్ఎస్కు ఆధిక్యాన్ని తెచ్చిపెట్టడంలో, బీజేపీ ఎక్కువ ఓట్లు దక్కించుకోకుండా చేయడంలో లెఫ్ట్ ప్రభావం ఉన్న 40 నుంచి 50 గ్రామాలు తన మార్కును చూపెట్టాయి. ముఖ్యంగా చౌటుప్పల్ మండలంలో బీజేపీ ఆధిక్యానికి గండికొట్టడంలో సీపీఐ(ఎం)కి మంచి పట్టున్న గ్రామాలు కీలకపాత్ర పోషించాయి. ఆ ఊర్లల్లో టీఆర్ఎస్కు దక్కిన ఓట్లే ప్రధాన భూమికను పోషించాయి. రాజగోపాల్‌రెడ్డి అనుచరగణం ఎన్ని విషప్రచారాలకు పూనుకున్నా కమ్యూనిస్టుల ప్రభావం బలంగా ఉన్న గ్రామాల్లో టీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. ఆ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించింది. చౌటుప్పల్ మండలం జైకేసారం, నేలపట్ల, ఎస్.లింగోటం, మందోళ్లగూడెం, చిన్నకొండూరుతో పలు గ్రామాల్లోనూ కమ్యూనిస్టు ఓట్లు టీఆర్ఎస్కు ప్లస్‌గా మారాయి. చౌటుప్పల్ మండలంలో తమకు ఐదు నుంచి 10 వేల మెజార్టీ వస్తుందని అంచనా వేసుకున్న రాజగోపాల్‌రెడ్డికి ఇది మింగుడు పడని అంశమే. ఆ మండలంలోని టీఆర్ఎస్ను లీడ్‌లోకి తీసుకురావడంలో ఆ గ్రామాలు ప్రముఖ పాత్ర పోషించాయి. సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాక, కొత్తగూడెం, చిమిర్యాల, గుజ్జ గ్రామాల్లో టీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం లభించింది. మునుగోడు మండలం కొరటికల్(సీపీఐ), చల్మెడ, కలకుంట్ల, కల్వలపల్లి, కచలాపురం, గ్రామాల్లో, సీపీఐ బలంగా ఉన్న చండూరు మండలంలో బంగారిగడ్డ, పుల్లెంల, కొండాపురంలో టీఆర్ఎస్కు ఆధిక్యత లభించింది. గట్టుప్పల్‌లోని గట్టుపల్, అంతంపేట, తెరట్పల్లి గ్రామాల్లో వామపక్షాల ఓట్లు టీఆర్ఎస్కు పడ్డాయి. సీపీఐ కొంతమేరకు బలంగా ఉన్న నాంపల్లి, మర్రిగూడెం మండలాల్లోనూ టీఆర్ఎస్కు గణనీయంగా ఓట్లు పడ్డాయి. వామపక్ష ప్రభావం ఉన్న చాలా గ్రామాలు 100 ఓట్లకుపైగా ఆధిక్యాన్ని చూపెట్టాయి. కొన్ని గ్రామాల్లో బీజేపీ ఆధిక్యాన్ని తగ్గించడంలో ప్రధాన భూమిక పోషించాయి. ఆయా గ్రామాల్లో వామపక్ష పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ గెలుపు కోసం బాధ్యతను మీదేసుకుని పనిచేశారు. వారి శ్రమ ఫలితం రూపంలో స్పష్టంగా కనిపించింది. టీఆర్ఎస్ శ్రేణులు కూడా కమ్యూనిస్టు కార్యకర్తలు కష్టపడి పనిచేసితీరును కొనియాడుతున్నారు.