Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీని నిలువరించటంలో జయప్రదం...
- వామపక్ష, లౌకిక శక్తుల ఐక్యతకు సూచిక
- రాష్ట్రానికి శుభ పరిణామంటున్న విశ్లేషకులు
- అవాకులు, చెవాకులకు వామపక్షాల ధీటైన సమాధానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ ఎక్కడున్నార్రా కమ్యూనిస్టులు...' అంటూ అవాకులు చెవాకులు పేలిన వారికి వామపక్షాలు ధీటైన సమాధానమిచ్చాయి. దమ్ముంటే సింగిల్‌గా పోటీ చేయాలంటూ రెచ్చగొట్టిన బీజేపీ నేతల సవాల్‌కు... 'కచ్చితంగా మిమ్మల్ని మట్టి కరిపించే దమ్ము మాకుందంటూ' జవాబిచ్చిన సుత్తీ, కంకీ కొడవళ్లు మునుగోడులో ఆ పార్టీ దుమ్ము దులిపాయి. మతోన్మాదం, ఫాసిజంపై నికరంగా, నిక్కచ్చిగా పోరాడటంలో తమకు తామే సాటి.. తమకెవ్వరూ లేరు పోటీ అని మరోమారు నిరూపించాయి. వెరసి మునుగోడులో సీపీఐ (ఎం), సీపీఐ మద్దతిచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకంట్ల ప్రభాకరరెడ్డి... బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై విజయకేతనం ఎగరేశారు. ఈ విక్టరీలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తొలి రోజు నుంచి ఫలితం వచ్చిన ఆదివారం దాకా బీజేపీ ఓటమే లక్ష్యంగా పని చేశాయి. సీపీఐ (ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు మార్గనిర్దేశంలో ఆ రెండు పార్టీల శ్రేణులు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఎన్నిక జరిగే రోజు వరకూ అవిశ్రాంతంగా పని చేసి... గమ్యాన్ని ముద్దాడాయి.
ఈ రకంగా కారు పార్టీ విజయంలో వామపక్షాలు క్రియాశీలక పాత్రను పోషించాయి. సైద్ధాంతిక ప్రాతిపదికన మతోన్మాదానికి వ్యతిరేకంగా నిలబడటమేగాదు.. అందుకోసం అవి నిక్కచ్చిగా పనిచేశాయి. ఈ పోరాటంలో ఎలాంటి రాజీలేదని మరోసారి స్పష్టం చేశాయి. ఇది కేవలం లెఫ్ట్ పార్టీల కార్యకర్తలు, నాయకులు చెబుతున్న మాట కాదు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా అంగీకరించిన వాస్తవం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా వామపక్ష, లౌకిక శక్తుల ఐక్యతకు బీజం పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరకంగా ఇది తెలంగాణతోపాటు దేశంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు సూచికగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదే జరిగితే రాష్ట్రానికి, ఇక్కడి ప్రజలకు శుభ సూచకమని వారు విశదీకరిస్తున్నారు. మరోవైపు ఈటల లాంటి బీజేపీ సీనియర్ నేతలు సైతం కమ్యూనిస్టుల మద్దతు లేకపోతే టీఆర్ఎస్ గెలిచేది కాదంటూ వ్యాఖ్యానిస్తున్నారంటే మునుగోడు విజయంలో కామ్రేడ్ల ప్రాధాన్యతేంతో విదితమవుతున్నది. దీంతో కమలం పార్టీ కార్యకర్తల నోళ్లు మూగబోయాయి. ఇదే సమయంలో కూసుకుంట్ల గెలుపులో వామపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాయటంటూ కేటీఆర్ చెప్పటంలో టీఆర్ఎస్లో సన్నాయి నొక్కులు నొక్కే వారు సైతం వాస్తవాలను గ్రహించామంటూ చెప్పటం గమనార్హం.