Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం విజయం సాధించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు అన్నారు. బీజేపీ మతోన్మాదశక్తులకు రాష్ట్రం లో తావు లేదని మునుగోడు ప్రజలు తీర్పు చెప్పారనీ, వారికి అభినందనలు తెలుపుతున్నామన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి విజయం సాధించడంపై హైదరాబాద్ మగ్దూంభవన్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆపార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ, కోమటిరెడ్డి రాజగోపాల్‌కు మునుగోడు తీర్పు చెంపపెట్టు వంటిదని అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీకి ఈ పాటి ఓట్లు కూడా రావని విశ్లేషించారు. మునుగోడు ఇప్పటికీ కమ్యూనిస్టుల కంచుకోట అని టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుతో స్పష్టమైందని తెలిపారు. రాష్ట్రంలోకి బీజేపీని రానివ్వబోమనీ, వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న ఎంపీ సీట్లు కూడా వారికి రావని చెప్పారు. జాతీయ స్థాయి వరకు మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తామన్నారు. దానికోసం వాటన్నింటినీ ఒకే వేదిక మీదికి తీసుకొచ్చేందుకు మునుగోడు ఉప ఎన్నిక దోహదపడుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తుల ఏకీకరణ అవసరాన్ని ఈ ఎన్నిక తెలియజేస్తుందన్నారు. దేశంలోని 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చినట్టే, తెలంగాణలో కూడా సుస్థిర ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని గుర్తుచేశారు. తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి పోటీ చేయించామని చెబుతున్న బీజేపీ, అదే పని గోవా, సిక్కిం సహా ఇతర రాష్ట్రాల్లో బీజేపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామాలు చేయించలేదని ప్రశ్నించారు. ఓటమి తర్వాత రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, ఈటీ నర్సింహారావు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ తదితరులు పాల్గొన్నారు.