Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బలహీన పోల్ మేనేజ్మెంట్తో...
- రేవంత్ మినహా బాధ్యతలను విస్మరించిన సీనియర్లు
- టీఆర్ఎస్, బీజేపీకి టచ్‌లో ఉన్న కొంత మంది నేతలు
- పని చేయని స్రవంతి 'సెంటిమెంట్'
- కలవరపెట్టిన భారత్ జోడో యాత్ర
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎన్నికల రణరంగంలో సుదీర్ఘ అనుభవం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కానీ మునుగోడు ఎన్నికల్లో ఆ అనుభవాన్ని సద్వినియోగం చేసుకోలేదని చెప్పొచ్చు. పోల్ మేనేజ్మెంట్ బలహీనంగా ఉండటంతో కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో మూడో స్థానానికి దిగజారింది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు బలమైన పునాది ఉన్నప్పటికీ డిపాజిట్ కోల్పోయి, ఘోరపరాజయం పాలైందనే విమర్శలు వస్తున్నాయి. ఏడు మండలాలకు అనుభవాజ్ఞులైన సీనియర్ నేతలను నియమించినప్పటికీ వారు తమ బాధ్యతను నిర్వర్తించలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్యాడర్‌ను పట్టించుకోకపోవడం, వారికి దిశానిర్దేశం చేయడంలో సీనియర్ నేతలు చేతులెత్తిసినట్టు చెబుతున్నారు. ఏక్ నిరంజన్‌లా టీటీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నీ తానై...ఎన్నిక క్షేత్రంలో పని చేశారు. భారత్ జోడో యాత్రను సమన్వయం చేస్తూ...రేవంత్‌రెడ్డి ఎన్నిక ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. మరికొంత మంది నేతలు మాత్రం రాహుల్‌గాంధీని ప్రసన్నం చేసుకునేందుకు తెగ ఆరాటపడ్డారు తప్ప ఎన్నికలపై దృష్టి సారించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోల్ మేనేజ్మెంటులో భాగంగా ప్రతి ఓటరు కలవడంలో విజయవంతమయ్యారు. కాంగ్రెస్ నేతలు మాత్రం నామ్‌కే వాస్తేగా గ్రామాల్లో పర్యటించారు తప్ప ఓటరు కలిసే ప్రయత్నం చేయడంలేదు. ఓటర్ను ఆకర్షించేందుకు తగిన ప్రణాళిక రూపొందించకుండా సభలు, సమావేశాలు, ప్రదర్శలను పెట్టారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌పై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దృష్టి సారించారు. ఈ విషయం తెలిసినప్పటికీ పార్టీ సీనియర్ నేతలు పోతే పోనీలే అన్నట్టు వ్యవహరించినట్టు స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటం, ఆస్త్రేలియా వెళ్లిపోవడం, ఎన్నికల ముగిసిన తర్వాత రావడం, తమ్ముడు రాజగోపాల్‌రెడ్డికి ఓట్లు వేయాలంటూ ఫోన్లు చేయడం, ఆయన బీజేపీలో చేరుతారా? అనేది అనుమానాలు వచ్చాయి. ఈ పరిణామాలు కూడా కాంగ్రెస్‌ను దెబ్బతీశాయనే ఆవేదన వ్యక్తమవుతున్నది.పెద్ద నాయకులతోపాటు స్థానిక నాయకులు కొంత మంది అటు బీజేపీతోనూ, టీఆర్ఎస్తోనూ టచ్‌లో ఉంటూ కాంగ్రెస్‌ను పట్టించుకోలేదు. ఆ పార్టీల ప్రలోభాలకు పెద్ద నాయకులే లొంగిపోయినట్టు స్థానికంగా ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో నన్ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి దించే కుట్రలు చేస్తున్నారంటూ రేవంత్‌రెడ్డి భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. మాజీ మంత్రి దామోదరరెడ్డి, పటేల్‌రమేష్‌రెడ్డి, సీతక్క, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కైలాస్నేత, కృష్టారెడ్డి తదితరులు పార్టీ అప్పగించిన బాధ్యతలను బాగా నిర్వర్తించినట్టు చెప్పారు. రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కొంత మంది ద్వితీయ శ్రేణి నాయకులు స్థానికగా ఉండి బాగా కష్టపడి పని చేశారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్న నేతలు చుట్టపు చూపుగా వచ్చి పోవడమే తప్ప పార్టీ గెలవాలనే తపన కనిపించలేదు. కొంత మంది సీనియర్లు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిని ఇక్కడ పని చేయకూడదంటూ పరోక్షంగా బెదిరించినట్టు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ తీసుకున్న కాళ్లు మొక్కుతాం, ఆడబిడ్డను సాదుకుంటారో, చంపుకుంటారో అంటూ రగిల్చిన సెంటిమెంట్ కూడా ప్రభావాన్ని చూపలేకపోయింది. ఎన్నిక రోజు పోలింగ్ బూత్‌ల వద్ద కాంగ్రెస్‌కు ఓటేయండి అని కనీసం చెప్పేవారు కూడా కరువయ్యారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఓటర్లను బూత్‌లకు తరలించి వారి ఓట్లు సాధించేందుకు శక్తిమేరకు కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఇది ఎక్కడా కనిపించలేదు. దాంతో కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలు తప్ప మిగతా వారెవ్వరూ ఆపార్టీకి ఓటు వేయలేదు. దీని ఫలితంగా కాంగ్రెస్ ఓడిపోయిందని నాయకులు విశ్లేషణలు చేస్తున్నారు.