Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంచిన ఓవర్ కాన్ఫిడెన్స్
- వివేక్‌కు ప్రచార బాధ్యతలు అప్పగించడంపై సీనియర్ల గుస్సా
- రాజగోపాల్‌రెడ్డి దుందుడుకు చర్యలతో పార్టీకి నష్టం
- కారును అదుపుచేయని స్టీరింగ్ కమిటీ
- పాతోళ్లకు-కొత్తోళ్లకు సమన్వయం చేయడంలో బండి వైఫల్యం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అతిగా ఊహించి ఉప ఎన్నికకు ఉరికిన బీజేపీ మునుగోడులో బొక్కబోర్లా పడింది. నోటిఫికేషన్‌కు ముందు నుంచే క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ బలగాలను మోహరించి ఏదో చేయాలని చూసినా...వామపక్ష భావజాలమున్న మునుగోడు ఓటరు దాన్ని తిప్పికొట్టారు. రాష్ట్రంలో అంతంతగానే ఉన్న బీజేపీ..సరిగ్గా ఉప ఎన్నికకు నాలుగైదు రోజుల ముందు అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్ల పర్వానికి పూనుకోవడం, అది బట్టబయలవ్వడం వంటి పరిణామాలు రాజగోపాల్‌రెడ్డికి తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. కాంగ్రెస్ పార్టీ లైట్‌గా తీసుకోవడం, సీనియర్లు స్రవంతికి సహకరించకపోవడం వంటి వాటితో కొంతమేర బీజేపీకి కలిసొచ్చిందిగానీ లేకుంటే అంతే. కాంగ్రెస్ పార్టీ గనుక క్షేత్రస్థాయిలో ఇంకాస్త గట్టిగా పోరాడినా, పెద్దఎత్తున కాంగ్రెస్ ఓట్లు పోలరైజ్ కాకుండా అడ్డుకున్నా బీజేపీకి ఆ ఓట్లు కూడా రాకపోయేవనే చర్చ నియోజకవర్గంలో నడుస్తున్నది. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల ఇన్చార్జిగా వివేక్ వెంకటస్వామినే కావాలని పట్టుబట్టి రాజగోపాల్‌రెడ్డి తెచ్చిపెట్టుకున్నారు. ఆయనకున్న పత్రిక, వార్తాఛానల్ ద్వారా అధికంగా లబ్దిపొందవచ్చని ఆయన భావించారు. కానీ, సీన్ రివర్స్ అయింది. స్టీరింగ్ కమిటీ కారును అదుపు చేయలేకపోయింది. పైగా, బీజేపీలో పొరపచ్చాలకు దారితీసింది. ఈటలతో సన్నిహితంగా ఉంటూ రాష్ట్రనేతలను పట్టించుకోకుండా నేరుగా అమిత్‌షా, కేంద్ర మంత్రులతో రాజగోపాల్‌రెడ్డి సంప్రదింపులు చేయడం రాష్ట్ర నేతలకు మింగుడు పడలేదు. ప్రజాసంగ్రామ యాత్రను మునుగోడు నియోజకవర్గంలో మరిన్ని రోజులు కొనసాగిస్తే తనకు ఉపయోగపడుతుందని రాజగోపాల్‌రెడ్డి వేడుకున్నా బండిసంజయ్ పట్టించుకోకపోవడాన్ని బట్టే వారిమధ్య వైషమ్యాలు నెలకొన్నట్టు అర్ధమవుతున్నది. అందుకే ర్యాలీలు, ప్రదర్శనలకు బండి పరిమితమయ్యారుగానీ క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రచారం చేయలేదు. కిషన్‌రెడ్డి ఒకటెండ్రు పర్యటనలతో మమా అనిపించుకున్నారు. దీంతో రాజగోపాల్‌రెడ్డి ఒంటరిగా ముందుకెళ్లారు. ఆ క్రమంలో బీజేపీ పాతకాపులను అస్సలే పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో బీజేపీకి 12 వేల ఓట్లు కూడా పడలేదనీ, పాతవాళ్లు ఉన్నా, పోయినా పెద్దగా నష్టం ఉండదనే ఉద్దేశంతో రాజగోపాల్‌రెడ్డి దూకుడుగా ముందుకెళ్లారు. దీంతో దశాబ్దాలుగా బీజేపీ కోసం పనిచేస్తున్నా తమను విస్మరించి కాంగ్రెస్ నుంచి వచ్చినవాళ్లకు పెత్తనం అప్పగించడంపై పాత కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. చాలా మంది పార్టీని వీడారు. పోతూపోతూ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో రాజగోపాల్‌రెడ్డికి చేటుగా మారింది. మునుగోడు బీజేపీ అంతంత మాత్రమే అన్నది జగమెరిగిన సత్యం. పూర్తిగా కాంగ్రెస్ ఓట్లను నమ్ముకుని ముందుకెళ్లే క్రమంలో రాజగోపాల్‌రెడ్డి ప్రదర్శించిన దుందుడుకు చర్యలు ఆయనకు నష్టం చేకూర్చాయి. ఆ నియోజకవర్గ స్థానిక నేత గొంగిడి మనోహర్‌రెడ్డి ఆయనకు పెద్దగా సహకరించలేదు. ఇప్పటికే రాజకీయ పెత్తనం కోసం బీజేపీలో బండి, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఇలా ఎవరికివారు ప్రయ త్నాల్లో ఉన్నారు. ఎవరికివారు గ్రూపులు కట్టి కలిసిపోరనే చర్చా ఉంది. దీనికితోడు కొత్తగా ఆ పార్టీలో చేరిన ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, రాజగోపాల్‌రెడ్డి లాంటి వాళ్లు కూడా ఎవరికివారు ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న పరిస్థితి ఉంది.