Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోటారు వాహనాల చట్టాన్ని కార్మికులకు అనుకూలంగా సవరించాలి
- రవాణారంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి : ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య
నవతెలంగాణ- ఖమ్మం
రవాణా రంగం లేకుండా ఈ సమాజాన్ని ఊహించడమే సాధ్యం కాదని, ప్రజాజీవనంలో మమేకమై స్వయం ఉపాధితో పనిచేస్తున్న కార్మికులందరూ తమ సమస్యల పరిష్కారం కోసం సమరశీల ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి రావినూతల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంచికంటి సమావేశ మందిరం (శ్యామల చక్రవర్తి ప్రాంగణం, సూదగాని లక్ష్మీనారాయణ నగర్)లో తుమ్మ విష్ణువర్ధన్ అధ్యక్షతన తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రయివేటు ట్రాన్స్‌ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్య్లూఎఫ్-సీఐటీయూ) తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభ జరిగింది. మహాసభల ప్రారంభం సూచకంగా రాష్ట్ర అధ్యక్షులు ఎం.సాయిబాబు యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆర్.లక్ష్మయ్య మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారి కాలంలో లాక్డౌన్ పేరుతో అందరూ ఇండ్లకే పరిమితమైతే.. రవాణారంగ కార్మికులు మాత్రం ప్రాణాలకు తెగించి నిత్యావసర సరుకులు, మందులు అందించడానికి రోడ్డు మీదకు వచ్చి పనిచేశారని కొనియాడారు. ప్రజలకు కనీస అవసరాలు, భద్రత అందిస్తూ సేవా రంగంలో పనిచేస్తున్న రవాణా రంగ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రవాణా రంగాన్ని కుదేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టాన్ని సవరించిందని ఆరోపించారు. స్వయం ఉపాధితో రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులకు పోటీగా కార్పొరేటు సంస్థలైన ఊబర్, ఓలా లాంటి సంస్థలను ప్రోత్సహిస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి లీటర్ డీజిల్, పెట్రోల్‌పై ఎనిమిది శాతం ఇన్ఫాస్ట్రక్చర్ పన్ను వసూలు చేస్తూ, మరలా టోల్గేట్ చార్జీలు వసూలు చేయటం ఏమిటని ప్రశ్నించారు. వీటిని ప్రశ్నిస్తే ప్రభుత్వం దగ్గర సమాధానమే లేదని తెలిపారు. అసంఘటితరంగంగా ఉన్న రవాణా రంగ కార్మికులకు సరైన వేతనాలు, వారాంతపు సెలవులు, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ వైద్య సౌకర్యాలు లేవన్నారు. అందుకే రవాణారంగ కార్మికులందరూ సోదర కార్మిక సంఘాలను కలుపుకొని సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల అజెండాలో రవాణా రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికై తమ మేనిఫెస్టోలో పెట్టే విధంగా పోరాటాలు ఉండాలన్నారు. రవాణా రంగ కార్మికుల్లో చైతన్యం కలిగించి మనోధైర్యం కలిగించే విధంగా పోరాటాలు రూపకల్పన చేయాలని, విప్లవ పోరాటాల గడ్డ ఖమ్మంలో జరుగుతున్న రాష్ట్ర మహాసభలు జయప్రదం కావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్.వీరయ్య, కళ్యాణం వెంకటేశ్వరరావు, ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు వై.విక్రమ్, టి.విష్ణు, జె.ఉపేందర్, కల్లూరి మల్లేశం, రవీందర్ రెడ్డి, పాషా, రామచందర్ అజరు బాబు తదితరులు పాల్గొన్నారు.