Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గెలవలేమని నిర్దారించుకునే వారి మద్దతు తీసుకున్నరు
- మునుగోడులో మేం చేయాల్సిన మేరకు పని చేయలేదు : ఈటల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు దక్కిన గెలుపు వామపక్షాల భిక్షేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటలిజెన్స్ నివేదికల ద్వారా సొంతంగా గెలవలేమని నిర్ధారించుకున్న తర్వాతే కేసీఆర్ కమ్యూనిస్టుల దగ్గరకెళ్లి మద్దతు కోరారని తెలిపారు. ప్రజల సమస్యలపై నిత్యం పోరాడే కమ్యూనిస్టు పార్టీల నేతలు వినతులు ఇవ్వడానికి కూడా సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదనీ, మునుగోడులో సొంతంగా గెలవలేమనే భావన రాగానే వారి వద్దకు పరిగెత్తారని విమర్శించారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకం కేసీఆర్ అని తాను మొదటి నుంచీ చెబుతున్నామన్నారు. కేసీఆర్ వైఖరి తెలిసి కూడా కమ్యూనిస్టులు ఆయనకు ఎందుకు మద్దతు ఇచ్చారో అర్ధం కాలేదన్నారు. 2014లో మునుగోడులో సీపీఐ(ఎం), సీపీఐ కి 30వేల దాకా ఓట్లు దక్కాయనీ, ఇప్పుడు వారి ఓట్లే టీఆర్ఎస్ గెలుపులో కీలకపాత్ర పోషించాయని తెలిపారు.ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డి గెలుపు కోసం తాము ఎంత మేరకు పనిచేయాలో అంతమేరకు పని చేయలేదని చెప్పారు. అయినా, తమ ఓటు బ్యాంకును 12 వేల నుంచి 86 వేలకు పెంచుకున్నామన్నారు. 14 మంది మంత్రులు, వందల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు మెహరించబడినా, అధికార, ధన, మద్యం, పథకాల పేరుతో ప్రలోబాలకు గురిచేసినా టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చిన మెజార్టీ కేవలం 10 వేల ఓట్ల మెజార్టీనే అని చెప్పారు. టీఆర్ఎస్కు కమ్యూనిస్టులు, ఎంఐఎం ఓట్లు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. పక్కాప్రణాళికాతో దృష్టి పెట్టి పనిచేస్తే నూరు శాతం విజయం సాధించేవాళ్లమన్నారు. ఇప్పటికీ నైతికంగా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిదే విజయం అన్నారు. తమ కార్యకర్తలు నూతన ఉత్తేజంతో పనిచేస్తారన్నారు. సెంటర్ కమాండ్ సెంటర్ ప్రజాప్రతినిధుల ఫోన్లను ట్యాంపరింగ్ చేసే కేంద్రంగా మారిందని విమర్శించారు.