Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ, టీఆర్ఎస్తో కలిసి త్వరలో రాజ్‌భవన్ ముట్టడి
- బీజేపీ మతోన్మాద భావజాలాన్ని ప్రతిఘటిస్తాం
- టీఆర్ఎస్ను గెలిపించిన మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు
- రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి
- కేంద్రానికి ఏజెంట్లుగా మారిన గవర్నర్లు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈనెల 12న రామగుండంలో ఎరువుల పరిశ్రమను ప్రారంభించేందుకు ప్రధాని మోడీ వస్తున్నారనీ, ఆయన పర్యటనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌తో చర్చించామన్నారు. దేశవ్యాప్తంగా గవర్నర్లు కేంద్రానికి ఏజెంట్లుగా మారారని విమర్శించారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కుట్ర చేస్తున్నారనీ, మంత్రులను తొలగించాలంటూ ఆదేశిస్తున్నారని అన్నారు. త్వరలోనే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని చెప్పారు. ఎన్నికల్లో కలిసి పనిచేయడంతోపాటు బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలంటూ సీఎం కేసీఆర్ తనతో చెప్పారన్నారు. సీపీఐ, టీఆర్ఎస్తోపాటు కలిసొచ్చే ఇతర శక్తులతో కలిసి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడతామని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వామపక్ష పార్టీలు బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించిన మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఇది గొప్ప విజయమన్నారు. రాష్ట్రంలో బీజేపీ మతోన్మాద భావజాలాన్ని ప్రతిఘటిస్తామన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పినట్టు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ఎన్నిక రాలేదన్నారు. ఇంకోవైపు తాము ఓడినా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనంటూ బండి సంజరు అంటున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఖతమైందంటూ వారు సంతోషిస్తున్నారని చెప్పారు. బీజేపీ కుట్రల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈటల, రఘునందన్‌రావు వల్లే ఆ రెండు చోట్ల బీజేపీ గెలిచిందని అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ గడ్డ, అభ్యుదయ భావాలకు నిలయమని చెప్పారు. ఇక్కడ మతోన్మాద భావజాలాన్ని ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదనీ, వాటిని ప్రతిఘటిస్తామనీ, కుట్రలు, కుతంత్రాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈడీ, సీబీఐతో బెదిరించి ఎమ్మెల్యేల కొనుగోలుకు చేసిన ప్రయత్నాలను ప్రజలు చిత్తు చేశారని చెప్పారు. మునుగోడులో కమ్యూనిస్టుల ఐక్యతతోనే టీఆర్ఎస్ విజయం సాధ్యమైందన్నారు. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు అహంకారంతో లేమనీ, గర్వంతో ఉన్నామని అన్నారు.
పోడు భూములకు పట్టాలివ్వాలి
మునుగోడులో టీఆర్ఎస్ గెలవడం వరకే పరిమితం కాకుండా ఇచ్చిన వాగ్దానాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికేంద్రీకరించాలని తమ్మినేని సూచించారు. వీలైనంత త్వరగా పోడు భూముల సమస్యను పరిష్కరించాలనీ, ఆక్రమణలో ఉన్న ప్రతి సాగుదారునికీ పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. అసంఘటిత, షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలివ్వాలనీ, జీవోలను సవరించాలని కోరారు. రైతులు, భూనిర్వాసితులు, ఆర్టీసీ కార్మికులు, కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలతోపాటు డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రజాసమస్యల పరిష్కారంతోపాటు కేంద్రం విధానాలను ప్రతిఘటించేందుకు ప్రజాఉద్యమాన్ని నిర్మించాలని కోరారు.
బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి : చెరుపల్లి
బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలనీ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే తీవ్ర పరిణామాలుంటాయని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు హెచ్చరించారు. మొదటినుంచి కమ్యూనిస్టులపైనే ఆ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్కు వామపక్షాలు మద్దతివ్వడంతో ఓటమి ఖాయం కావడంతో వారికి కంటగింపుగా మారిందన్నారు. ఓట్లు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే లక్షణం ఆపార్టీకే ఉందని అన్నారు. నల్లగొండ రాజకీయాలను కోమటిరెడ్డి బ్రదర్స్ భ్రష్టుపట్టించారని విమర్శించారు. బీజేపీ ప్రమాదాన్ని నిలువరించడం కోసమే టీఆర్ఎస్కు మద్దతిచ్చామని చెప్పారు.
బీజేపీకి చెంపపెట్టు : జూలకంటి
మునుగోడు ఫలితం బీజేపీకి చెంపపెట్టు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం, మతోన్మాద భావజాలాన్ని ఓడించడం కోసమే టీఆర్ఎస్కు మద్దతిచ్చామని చెప్పారు. ధనబలం, కేంద్రంలో అధికారంతో గెలవాలన్న వారి కుట్రలను ప్రజలు చిత్తు చేశారన్నారు. బీజేపీ నాయకులు ఈ ఎన్నికల సందర్భంగా తెలంగాణకు, మునుగోడుకు ఏం చేస్తారో చెప్పలేదని విమర్శించారు. కానీ రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే నెలరోజుల్లో ఈ ప్రభుత్వాన్ని పడగొడతామన్నారని గుర్తు చేశారు. ఏడాదిలో సాధారణ ఎన్నికలుంటాయనేది తెలిసినా రాజగోపాల్‌రెడ్డి స్వార్థం, రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే రాజీనామా చేశారని అన్నారు. కాంగ్రెస్‌కు ద్రోహం చేసిన ఆయనకు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ పాల్గొన్నారు.