Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2007 తొలి టీ20 ప్రపంచకప్ విజయంతో ప్రపంచ క్రికెట్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది టీమ్ ఇండియా. ధోనీసేన గెలుపు గర్జనతో ఆధునిక క్రికెట్ స్వరూపమే మారిపోయింది. ఆ తర్వాత భారత్ వన్డే వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. కానీ మరో పొట్టి ప్రపంచకప్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. 2014 టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ పోరు వరకు చేరుకున్న టీమ్ ఇండియా.. తుది అడుగులో తడబాటుకు లోనైంది. స్వదేశంలో 2016లో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగింది. కానీ ధనాధన్ దంచుడులో వెనుకంజ వేసి సెమీస్‌లోనే నిష్క్రమించింది. 15 ఏండ్ల నిరీక్షణకు తెరదించేందుకు భారత్‌కు తాజాగా మరో అవకాశం. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ భారత్‌కు ఇంకో రెండు అడుగుల దూరంలోనే నిలిచింది. రోహిత్‌సేన ఈ అవకాశం అందుకునేనా?!.
- వ్యూహ చతురత సైతం కీలకం
- తొలుత ఆడిలైడ్‌లో ఇంగ్లాండ్ సవాల్
నవతెలంగాణ క్రీడావిభాగం
ఇదే మంచి తరుణం! :
టీ20 ప్రపంచకప్ విజయం అందుకునేందుకు టీమ్ ఇండియా ఇదే మంచి తరుణం. 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించి విమర్శల పాలైన టీమ్ ఇండియా.. తాజా టోర్నీలో గ్రూప్-2లో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్స్‌కు చేరుకుంది. గత ఏడాది గాయానికి శస్త్రచికిత్స చేసేసింది. కానీ, పొట్టి ప్రపంచకప్ దిశగా భారత్ గమ్యం చేరుకునేందుకు ఇంకా రెండు అడుగులు వేయాల్సి ఉంది. నాయకత్వ పగ్గాలు విరాట్ కోహ్లి నుంచి రోహిత్ శర్మ అందుకున్నాడు. నాయకుడిగా ఐపీఎల్లో అదరగొట్టిన రోహిత్ శర్మ భారత్‌కు మరో ఐసీసీ టైటిల్ అందివ్వగల సమర్థమైన సారథి అని విమర్శలు అంటుంటారు. రోహిత్ శర్మ సహా సూపర్‌స్టార్ విరాట్ కోహ్లికి బహుశా ఇదే చివరి టీ20 ప్రపంచకప్ కావచ్చు. 2024 టీ20 వరల్డ్‌కప్‌కు రోహిత్ శర్మ 39వ వసంతంలోకి అడుపెడతాడు. కోహ్లి సైతం 38 పూర్తి చేసుకుంటాడు. ఫిట్నెస్, ఫామ్ నిలుపుకుంటే 2024లో ఆడే అవకాశం ఉండేచ్చేమో గానీ.. జట్టుకు టైటిల్ అందించగల సత్తా, సామర్థ్యం ఉందని చెప్పటం కష్టమే అవుతుంది. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు పొట్టి ప్రపంచకప్‌పై ముద్దు పెట్టేందుకు ఇదే సరైన సమయం.
సేవియర్ సూర్య భరోసా :
కెరీర్ భీకర ఫామ్‌లో ఉండగా పొట్టి ప్రపంచకప్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. మెల్బోర్న్లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లి సంప్రదాయ విధ్వంసం చూసిన అభిమానులకు.. సూర్యకుమార్ విలక్షణ విందు భోజనం అందిస్తున్నాడు. మైదానం నలుమూలలా 360 డిగ్రీల కోణంలో ఎక్కడైనా బౌండరీ బాదగల సామర్థ్యం సూర్య సొంతం. మెల్బోర్న్లో జింబాబ్వేపై డెత్ ఓవర్లలో సూర్య కుమార్ యాదవ్ ప్రదర్శన అసమానం. అతడి షాట్లు, ఫుట్‌వర్క్, నమ్మశక్యం కాని స్కూప్, స్వీప్ షాట్ల గురించి వర్ణించేందుకు వ్యాఖ్యాతలకు మాటలు సరిపోవటం లేదు. టాప్ ఆర్డర్లో విరాట్ కోహ్లి సూపర్ ఫామ్ అందుకోగా.. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ ప్రత్యేక ప్రదర్శనలు భారత్‌కు గొప్ప అనుకూలత. ప్రపంచ అత్యుత్తమ టీ20 బ్యాటర్, కెరీర్ ఉత్తమ ఫామ్‌లో ఉండగా.. పొట్టి ప్రపంచకప్ నెగ్గేందుకు టీమ్ ఇండియాకు ఇంతకుమించిన తరుణం ఏముంటుంది?!.
వ్యూహ చతురత కీలకం :
ఐసీసీ ప్రపంచకప్ నాకౌట్ దశలో మ్యాచ్‌కు ముందు జట్ల బలాబలాలు, కాగితంపై ఫేవరేటిజం పని చేయవు. ఒత్తిడిలో ఉత్తమ ప్రదర్శన చేసిన జట్టును విజయం వరిస్తుంది. ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి తోసేసేందుకు వ్యూహలు ఉపయోగపడతాయి. ఇప్పుడు టీమ్ ఇండియా చేయాల్సిన పని అదే. పాకిస్థాన్‌తో ఆసియా కప్ మ్యాచ్‌లో జడేజాను నం.4 స్థానంలో పంపి పాక్‌ను అయోమయంలోకి నెట్టినట్టు.. గురువారం ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లోనూ రోహిత్, ద్రవిడ్‌లు వ్యూహాత్మక ఎత్తుగడలపై మేధోమథనం జరపాలి. తుది జట్టు ఎంపికలో కోచ్, కెప్టెన్ ఒకే అభిప్రాయం సాధించటం అవసరం. 2019 వరల్డ్‌కప్‌ను తుది జట్టు ఎంపిక అంశంలో పొరపాటుతోనే చేజార్చుకున్న విషయం ఇక్కడ ప్రస్తావనర్హాం. అటువంటి పొరపాటుకు తావులేకుండా ఆడిలైడ్‌లో తుది జట్టును ఎంచుకోవాలి.
పంత్‌ను పట్టుకురావాలి :
వేగవంతమైన పిచ్‌లు.. అదనపు బౌన్స్, పేస్ లభించే ఆస్ట్రేలియాలో ఫినిషర్ దినేశ్ కార్తీక్ బ్యాట్‌తో ప్రభావం చూపటం లేదు. అతడు డెత్ ఓవర్లలో క్రీజులోకి వచ్చినా, మిడిల్ ఓవర్లలో క్రీజులోకి వచ్చినా బౌండరీలు సాధించగల దూకుడు కార్తీక్‌లో లోపించింది. జింబాబ్వేతో చివరి గ్రూప్ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకోగా.. మెల్బోర్న్లో పంత్ ప్రభావశీలంగా కనిపించాడు. ఓ అద్భుత ఫీల్డింగ్ నైపుణ్యం తోడైతే గానీ పంత్ పెవిలియన్‌కు చేరుకోలేదు. ఆడిలైడ్‌లో స్క్వేర్ బౌండరీలు చిన్నగా ఉంటాయి. ఈ అనుకూలతను సొమ్ము చేసుకునేందుకు లెఫ్డ్ హ్యాండ్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు జట్టులో చోటు దక్కాలి. నాణ్యమైన ఇంగ్లాండ్ పేసర్లను స్వేచ్ఛగా ఆడగల ఆటగాడు పంత్. కీలక సెమీఫైనల్లో జట్టు మేనేజ్మెంట్ పంత్‌ను తుది జట్టులోకి పట్టుకురావాల్సిందే.
టీ20 ప్రపంచకప్ వేటలో టీమ్ ఇండియాకు మరో సానుకూలత. సెమీఫైనల్ వేదిక ఆడిలైడ్. టైటిల్ పోరుకు వేదిక మెల్బోర్న్. ఈ రెండు స్టేడియాల్లోనూ భారత్ సూపర్12 దశలో ఆడేసింది. ఆడిలైడ్‌లో బంగ్లాదేశ్‌పై సాధికారిక ప్రదర్శన చేసింది. మెల్బోర్న్లో పాకిస్థాన్, జింబాబ్వేలతో ఆడింది. దీంతో ఇక్కడి పరిస్థితులపై భారత్‌కు ఇప్పటికే ఓ మంచి అవగాహన ఏర్పడింది. మెల్బోర్న్ రెండో మ్యాచ్‌లో ఆ విషయం స్పష్టంగా తెలిసింది. సెమీస్ సమరంలో ఆడిలైడ్‌లోనూ ఆ అనుకూలతను రోహిత్ శర్మ వాడుకోవాలి.