Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రిట్‌పై నేడు హైకోర్టు ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమ్మెల్యేల కొనుగోళ్లపై బీజేపీ వేసిన కేసుకు సంబంధించిన విచారణ అర్హత అంశంపై మంగళవారం తగిన ఆదేశాలిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి వేసిన రిట్‌ను సోమవారం జస్టిస్ విజరుసేన్‌రెడ్డి విచారించారు. రిట్‌కు విచారణ అర్హత లేదనీ, క్రిమినల్ కేసుకు ఏమీ సంబంధం లేని పార్టీ లేదా వ్యక్తి రిట్ వేసే అర్హత లేదని ప్రభుత్వం వాదించింది. రిమాండ్ రిపోర్టు, ఎఫ్ఐఆర్, ఇతరత్రా ఏ విధంగానూ పిటిషనర్ పేరు ప్రస్తావన కూడా లేదనీ, ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని రిట్ వేసే అర్హత పిటిషనర్‌కు లేదని అదనపు ఏజీ రామచంద్రరావు చెప్పారు. దర్యాప్తును వాయిదా వేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. నిందితులు కాని వాళ్లు ఒక పార్టీకి చెందిన వాళ్లు కేసు ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు. వారి తరఫున కర్నాటక మాజీ ఏజీ సీనియర్ అడ్వకేట్ ఉదరు హ్రౌళ్లి వాదించారు. సీబీఐ దర్యాప్తునకు ఇస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. రాజకీయ కుట్రతో కేసు పెట్టారనీ, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే సీబీఐ లేదా హైకోర్టు ఆధ్వర్యంలోని సిట్‌కు ఇవ్వాలని కోరారు. సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులివ్వాలన్న ఆ కేసులో నిందితులైన రామచంద్రభారతి, కోరె నందకుమార్, సింహయాజిల అభ్యర్థనను ఆమోదించాలన్నారు. వాదనల అనంతరం విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.