Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నా కసి అంతా టీఆర్ఎస్ను ఓడించడమే
- మునుగోడు ఓటమిపై సమీక్షలో బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తన మనస్సులో ఏమీ లేదనీ, కసి అంతా టీఆర్ఎస్ను ఓడించడమే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై స్టీరింగ్ కమిటీ, ముఖ్య నేతలతో బండి సంజయ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టీరింగ్ కమిటీ చైర్మెన్ వివేక్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మునుగోడు బైపోల్లో కార్యకర్తల పోరాటాన్ని ప్రశంసించారు. టీఆర్ఎస్ను ఓడించాలనే కసితోనే పాదయాత్రతో నిరంతరం ప్రజల్లోకి వెళ్తున్నానని చెప్పారు. ఉప ఎన్నికలో గెలవకపోయినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేనే అని కొనియాడారు. గంగిడి మనోహర్ రెడ్డి పార్టీ అభివృద్ధికి చేస్తున్న కృషి, త్యాగం మరువలేనిదన్నారు. రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకొస్తానంటే.. ఆయన మనస్ఫూర్తిగా స్వాగతించారని చెప్పారు. మనోహర్ రెడ్డికి పార్టీలో ఉన్నత స్థానం కల్పించాలని రాజగోపాల్ రెడ్డి తనతో చాలాసార్లు చెప్పారని గుర్తుచేశారు. మునుగోడులో గెలవలేకపోయినా బీజేపీపై ప్రజల్లో అభిమానం భారీగా పెరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో పార్టీని మరింత బలోపేతం చేస్తూ అధికారం దిశగా సాగాలని సూచించారు. టీమ్ వర్క్ చాలా బాగుందనీ, అప్పగించిన బాధ్యతను ప్రతి ఒక్కరూ పూర్తిచేశారని అభినందించారు. గెలుపోటములు సహజమని బండి తెలిపారు. టీఆర్ఎస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక ఉందనే విషయం ఈ ఎన్నిక ద్వారా బయటపడిందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఓడినందుకు తనకు బాధలేదనీ, నైతిక విజయం తనదేనని చెప్పారు. గతంలో బీజేపీకి 12 వేల ఓట్లు వస్తే.. ఇప్పుడు 86 వేల ఓట్లు సాధించడం గొప్ప పరిణామం అన్నారు. ముఖ్యమంత్రి కమ్యూనిస్టుల కాళ్లు పట్టుకుని గెలిచారని విమర్శించారు. తాను గెలిచి ఉంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ ఖతమయ్యాయనే వాతావరణం రాష్ట్రమంతటా ఏర్పడేదన్నారు. పోలింగ్‌కు చివరి మూడు రోజులు టీఆర్ఎస్ ఎన్ని నీచమైన పనులు చేసిందో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా 150 మంది స్థానికేతర టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మనుగోడులోనే మకాం వేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, విజయశాంతి, వివేక్, మాజీమంత్రి బాబు మోహన్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.