Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ పార్టీకి రాష్ట్రంలో స్థానం లేదు:టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నిండా మునిగిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఎద్దేవా చేశారు. అయినా ఆ పార్టీ నేతలు తమదే పై చేయి అన్నట్టుగా మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి వివేకా మాట్లాడారు. ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకోవటం ద్వారా బీజేపీ ఈ ఎన్నికలో లబ్ది పొందేందుకు ప్రయత్నించిందని ఆయన విమర్శించారు. కారును పోలిన గుర్తుల వల్ల తమ పార్టీ అభ్యర్థి ఏడు వేల ఓట్లను కోల్పోయారని చెప్పారు. వాటిని కూడా కలుపుకుని చూసినప్పుడు కూసుకుంట్లకు వచ్చిన మెజారిటీ 17 వేలని వివరించారు. మునుగోడు దెబ్బతో రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదనే విషయం తేలిపోయిందన్నారు. వామపక్షాలతో తమ పొత్తును కుట్రగా పేర్కొనటం శోచనీయమన్నారు. ఆయా పార్టీలతో టీఆర్ఎస్ బహిరంగంగానే పొత్తు పెట్టుకుంది తప్ప బీజేపీలాగా లాలూచీ రాజకీయాలు చేయలేదని విమర్శించారు.
కేసీఆర్‌కు ఓటర్లు అండగా నిలిచారు..:టీఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్ నేత, మాలోత్ కవిత
మునుగోడు ఉప ఎన్నికలో అక్కడి ఓటర్లు సీఎం కేసీఆర్‌కు, తమ ప్రభుత్వానికి అండగా నిలిచారని టీఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్ నేత, మాలోత్ కవిత అన్నారు. ఈ ఎన్నికలో తమ పార్టీ న్యాయం కోసం యుద్ధం చేసిందని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌తో కలిసి వారు మాట్లాడారు. మోడీ కార్పొరేట్ ఎత్తుగడలను మునుగోడు ప్రజలు చిత్తు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ను అడ్డుకునేందుకే మోడీ, షా ఉప ఎన్నికను తెచ్చారని తెలిపారు. తద్వారా వారు బీజేపీని ఓ డ్రామా కంపెనీలాగా మార్చారని విమర్శించారు. అయినా ఓటర్లు చైతన్యంతో వ్యవహరించి ఆ పార్టీకి అడ్డుకట్ట వేశారని తెలిపారు.